అత్యాచారం అనివార్యమైతే ఆనందపడండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. కర్ణాటకలో రాజకీయ దుమారం
కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుమాలిన పని అని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రమేష్‌కుమార్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి.

అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆ చర్యను ఆనందంగా ఆస్వాదించాలి
కర్ణాటక అసెంబ్లీలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్ నిరాకరించారు. సభలో సభ్యులను అదుపు చేయడం తనకు తలకు మించిన భారంగా మారిందని స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే పేర్కొన్నారు. తాను ఎలాంటి పరిస్థతుల్లో ఉన్నానంటే మీరు చెప్పే ప్రతిదానిని అస్వాదిస్తూ అవును అవును అంటూ ఉండాల్సి వస్తుందని నవ్వుతూ పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ కుమార్ అత్యాచారం అనివార్యమైనప్పుడు ఆ చర్యను ఆనందంగా ఆస్వాదించాలని అన్న విధంగా స్పీకర్ పరిస్థితి ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో దుమారం
రమేష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. రమేష్ కుమార్ దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి డిమాండ్ చేశారు. అడపడుచులు ఓట్లు వేసి గెలిపిస్తే ఇంత అవమానకరంగా మాట్లాడతారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్‌కుమార్‌ను సస్పెండ్ చేసి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కేపీసీసీ అధ్యక్షుడిని డిమాండ్ చేశారు.

వివాదస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తకాదు..
రమేష్ కుమార్‌కి ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. గతంలో కూడా అనేక సార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిలువునా పరువు పొగొట్టుకున్నారు. గతంలో అసెంబ్లీ స్పీకార్‌గా ఉన్న సమయంలో తనను తాను అత్యాచార బాధితుడితో పోల్చుకున్నారు. దీనిపై నాడు మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో సభకు క్షమాపణ చెప్పారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ వేదికగా రమేష్ కుమార్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మహిళ సంఘాలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సబబు కాదని హితవు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications