బెంగళూరులో ఓ ఊపుఊపేసిన వాన, ఐదు రోజులు ఇంతే మిత్రమా, అలర్ట్ గా ఉంటే!
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో బుధవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో బెంగళూరు నగరంలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు బెంగళూరులో వానలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బెంగళూరులో వానలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వెయ్యడంతో ఐటీ హబ్ ప్రజలు అలర్ట్ అయ్యారు.
బుధవారం కూడా మేఘావృతమై చల్లని వాతావరణం బెంగళూరులో కనపడింది. అయితే రాత్రి కావడంతో చిరుజల్లులుగా ప్రారంభమైన వర్షం రెండు గంటలకు పైగా బెంగళూరులో దుమ్ము దులిపేసింది. బుధవారం రాత్రి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అయితే బెంగళూరులో పేర్కొన్నంత వర్షాలు పడలేదని కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు నిర్వహణ కేంద్రం (కెఎస్‌ఎన్‌డిఎంసి) తెలిపింది.

కెంగేరిలో 27 మి.మీ వర్షం కురవగా, దక్షిణ మండలం కోరమంగళలో 25.5 మి.మీ వర్షం నమోదైంది. మిగిలిన చోట్ల కెంగేరి (2) 18.5, విద్యాపీఠ్ 19, హెచ్.గొల్లహళ్లి 18.5, వన్నార్‌పేట 11.5, హంపీనగర్ 11.5, ఉత్తరహళ్లి 11.5, పట్టాభిరామనగర్ 11.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కెంగేరి ప్రాంతంలో సుదీర్ఘంగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రధాన రహదారులు, చిన్నచిన్న రోడ్లపై వర్షపు నీరు భారీ ఎత్తున నిలిచిపోయింది. నాయండహళ్లి జంక్షన్, ఆర్‌ఆర్ నగర్ గేట్, జ్ఞానభారతి, నాగరభావి, కోరమంగళ, డెయిరీ సర్కిల్, నిమ్హాన్స్, చామరాజ్‌పేట, లాల్‌బాగ్‌తో, జయనగర్ తో పాటు కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.
వాతావరణ శాఖ అందించిన సూచనల ప్రకారం బెంగళూరు నగరంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడుతాయని తెలిసింది. బెంగళూరులో పగలు సూర్యుడిని చూడడం చాలా అరుదు అయ్యింది. చల్లటి వాతావరణంతో పాటు పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి, మరో ఐదు రోజులు కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
మొదటి మూడు రోజుల్లో కర్ణాటకలోని కోస్తా, దక్షిణ లోతట్టు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరో మూడు రోజుల ఉత్తర కర్ణఆటకలోని లోతట్టు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. మొత్తం మీద బుధవారం బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో గ్యాప్ ఇవ్వకుండా వాన పడటంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.












Click it and Unblock the Notifications