చిక్కపేట్ చిక్కది అయినా చిక్కులు ఎక్కువే, నాయకులకు తలనొప్పి, దేవరాజ్ తో గేమ్స్?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల జోరు తారాస్థాయికి చేరుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు చాలా మంది ఇప్పటికే నామినేషన్లు వెయ్యడం మొదలుపెట్టారు. టిక్కెట్ రాకపోయినా ఇద్దరు మహిళలు నామినేషన్లు వెయ్యడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది. చిక్కపేట్ లో నాయకులకు చిక్కులు మొదలై పెద్ద తలనొప్పిగా మారింది.
బెంగళూరులోని సిటీ మార్కెట్, అవెన్యూ రోడ్డు తదితర ఏరియాలు ఉండే చిక్కపేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ గంగాంబీకే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాలనే ఆశతో నామినేషన్ దాఖలు చేశారు. చిక్కపేట్ లో ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎవ్వరికి టిక్కెట్ ఇవ్వలేదు. పార్టీ అధికారికంగా టికెట్ ప్రకటించనప్పటికీ మాజీ మేయర్ గంగాంబికే నామినేషన్ పత్రాలు సమర్పించడం హాట్ టాపిక్ అయ్యింది.

అదే చిక్కపేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కేజీఎఫ్ బాబు ఆయన సతీమణి షాజియా తరణంతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించి గందరగోళానికి తెరలేపాడు. కేజీఎఫ్ బాబు, గంగాంబీకే ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశిస్తున్నారు. అయితే చిక్కపేట్ మాజీ ఎమ్మెల్యే, మాస్ లీడర్ ఆర్ వీ. దేవరాజ్ తనకే టికెట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కేజీఎఫ్ బాబు, మాజీ మేయర్ గంగాంబికే పోటాపోటీగా వారివారి అనుచరులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేశారు. తనకు టిక్కెట్ ఇచ్చినా పర్వాలేదు, కేజీఎఫ్ బాబు భార్యకు టిక్కెట్ ఇచ్చినా పర్వాలేదు, ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఇద్దరూ కలిసి పని చేస్తామని, మాజీ ఎమ్మెల్యే ఆర్ వీ దేవరాజ్ కు టిక్కెట్ ఇస్తే మాత్రం మేము రెబల్స్ గా బరిలో ఉంటామని మాజీ మేయర్ గంగాంబికే తేల్చి చెప్పారు.
అయితే గతంలో ఎస్ఎం. కృష్ణ ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆయన ఎమ్మెల్యే కాదు. అప్పటికి చిక్కపేట్ ఎమ్మెల్యే ఆర్.వీ. దేవరాజ్ ఆయన ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఆయన నియోజక వర్గంలో ఎస్ఎం. కృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన సీఎం పదవిని సేఫ్ గా ఉండేటట్లు చేశారు. అప్పటి నుంచి ఆర్ వీ. దేవరాజ్ కు కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లో మంచి పట్టు ఉన్న ఆర్ వీ. దేవరాజ్ కు ఇప్పుడు టిక్కెట్ ఇవ్వకూడదని కొంత మంది కంకణం కట్టుకుని డబ్బు ఉన్న వారిని రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే కేజీఎఫ్ బాబు లాంటి వాళ్లు తెరమీదకు వస్తున్నారని చిక్కపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ లో చిక్కపేట్ టిక్కెట్ ఎవరికి ? అనే విషయంలో ఫుల్ క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications