ఒకే స్టార్ హోటల్ లో అమిత్ షా, డీకే శివకుమార్, రాత్రి బెంగళూరులో ఏం జరిగింది!
బెంగళూరు/దేవనహళ్లి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల నాయకుల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఇలాంటి సమయంలో కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ ఒకే టైమ్ లో ఒకే స్టార్ హోటల్ లో ఉండటం హాట్ టాపిక్ అయ్యింది.
తన మీద కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని, సీబీఐ, ఈడీ అధికారులతో తనను, తన కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురి చేసి నానా రకాలుగా బీజేపీ హైకమాండ్ టార్చర్ పెడుతున్నదని ఇంతకాలం కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి శుక్రవారం అమిత్ షా బెంగళూరు వచ్చారు. భారీ వర్షాల కారణంగా దేవనహళ్లిలో అమిత్ షా రోడ్ షో రద్దు కావడంతో అక్కడ నుంచి నేరుగా బెంగళూరు చేరుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా ఇక్కడి రోస్ కోర్స్ రోడ్డులోని తాజ్ వెస్ట్ ఎండ్ స్టార్ హోటల్ లో బస చేశారు.
కేంద్ర మంత్రి అమిత్ షా రాత్రి 7 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు తాజ్ వెస్ట్ ఎండ్ లో మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జ్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై, కర్ణాటక బీజేపీ ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ తదితరులతో ఒకరి తరువాత ఒకరితో పర్సనల్ గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చలు జరిపారు.
అదే సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ కూడా తాజ్ వెస్ట్ ఎండ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. రాయి టెంకాయిలా బయట విమర్శలు చేసుకుంటున్న కేంద్ర మంత్రి అమిత్ షా, డీకే. శివకుమార్ ఒకే స్టార్ హోటల్ లో ఉండటంతో అక్కడికి వెళ్లిన బీజేపీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్ చార్జ్ రణదీప్ సుర్జేవాలా అప్పటికే తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో బస చెయ్యడంతో ఆయన్ను కలవడానికి డీకే. శివకుమార్ తాజ్ వెస్ట్ ఎండ్ హెటల్ కు వెళ్లారు. ఒకే స్టార్ హోటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మామూలుగా స్టార్ హోటల్స్ లో ఒకే సమయంలో పలు పార్టీల నాయకులు ఉండటం అప్పుడప్పుడు జరుగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల కూడా సమయం లేని టైమ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు స్టార్ హోటల్ లో ఉండటం ఇప్పుడు జోరుగా చర్చ మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications