Amazon, Instamart లైసెన్సులు రద్దు! ఊహించని షాక్ ఇచ్చిన ప్రభుత్వం
మనం నిత్యం వాడుకునే ఆన్‌లైన్ గ్రాసరీ యాప్‌లు మన ఆరోగ్యంపై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాయో వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ ఉదంతం నిరూపించింది. తినడానికి ఏమాత్రం పనికిరాని, అత్యంత ప్రమాదకరమైన విషపూరిత ఉమ్మెత్త కాయలు, విత్తనాలను ఆహార పదార్థాలుగా భావించి విక్రయిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల ఆటలకు కర్ణాటక ఆహార భద్రత , ఔషధ పరిపాలన శాఖ కరెక్ట్ టైమ్‌లో చెక్ పెట్టింది. ప్రజారోగ్యంతో తీవ్రంగా చెలగాటమాడుతున్న అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ సంస్థల ఫుడ్ లైసెన్స్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
షాపింగ్ యాప్‌లలో 'ఉమ్మెత్త' ఉత్పత్తులను ఆహారంగా విక్రయిస్తున్నారంటూ అధికారులకు వరుస ఫిర్యాదులు అందాయి. దీనిపై రంగంలోకి దిగిన అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. మనుషులు తింటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ఉమ్మెత్త కాయలు, విత్తనాలను ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రదర్శించడమే కాకుండా, వాటి ప్యాకెట్లపై ఏకంగా భారత ఆహార భద్రత ప్రాధికార సంస్థ ప్యాసీ రిజిస్ట్రేషన్, లైసెన్స్ నంబర్లను కూడా ముద్రించినట్లు అధికారులు గుర్తించారు. తమ గోడౌన్లలో వీటిని భద్రపరిచి, నేరుగా వినియోగదారులకు ఆహార పదార్థంగా హోమ్ డెలివరీ చేస్తుండటం పట్ల అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కంపెనీల సమాధానంపై అసంతృప్తి.. కఠిన చర్యలు!
ఈ విషపూరిత విక్రయాలపై విచారణకు హాజరైన సదరు కంపెనీల ప్రతినిధుల నుంచి అధికారులు వివరణ కోరారు. అయితే, అమెజాన్ సంస్థ దీనిపై అసలు ఎలాంటి వివరణ ఇవ్వకపోగా.. ఇన్‌స్టామార్ట్ సరైన పత్రాలు సమర్పించేందుకు మరింత సమయం కావాలని కోరింది. బిగ్‌బాస్కెట్ మాత్రం తాము ఇప్పటికే ఆన్‌లైన్ విక్రయాలను నిలిపివేశామని, భవిష్యత్తులో "ఇది మనుషులు తినడానికి కాదు" అనే హెచ్చరికతో అమ్ముతామని సమాధానమిచ్చింది. అయితే, ఈ-కామర్స్ కంపెనీలు ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని తేల్చిచెప్పిన అధికారులు.. ఉమ్మెత్తను ఆహారంగా నిల్వ చేయడం లేదా అమ్మడం తీవ్రమైన నేరమని స్పష్టం చేస్తూ మూడింటి లైసెన్స్‌లను తక్షణమే రద్దు చేశారు.
సప్లయర్ల లైసెన్స్‌లు కూడా రద్దు
కేవలం ఈ-కామర్స్ యాప్‌ల లైసెన్స్‌లే కాకుండా.. వాటికి ఈ విషపూరిత ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సప్లయర్లు, సెల్లర్ల లైసెన్స్‌లను కూడా తక్షణమే రద్దు చేయాలని అధికారులు ఆదేశించారు. తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఉమ్మెత్త సంబంధిత అన్ని ఉత్పత్తుల ప్రకటనలు, లిస్టింగ్‌లను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. సదరు సంస్థలు మళ్లీ తమ పత్రాలను సమర్పించి, పూర్తి స్థాయి విచారణకు హాజరయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ సంస్థనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.














Click it and Unblock the Notifications