సెక్స్ రాకెట్: టీచర్లు, విద్యార్థినులపై అత్యాచారం: వలలో మరో ముగ్గురు: అధికార పార్టీకి చుక్కలే
చెన్నై: పొల్లాచ్చి సెక్స్ రాకెట్.. ఈ పేరు వింటే ఇప్పటికీ తమిళనాడువాసులు ఉలిక్కిపడతారు. పొల్లాచ్చిలోని నలుగురు సభ్యుల ముఠా వందమందికిపైగా మహిళలు, యువతులపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతం ఇది. అత్యాచార బాధితుల్లో విద్యావంతులతో పాటు సాధారణ గృహిణులూ ఉన్నారు. వేర్వేరు కారణాలను చూపుతూ మహిళలు, యువతులను లొంగదీసుకోవడం, వారిపై అత్యాచారానికి పాల్పడటం.. దాన్ని రికార్డ్ చేసి బెదిరించడం ఇలా అయిదేళ్ల పాటు సెక్స్ రాకెట్‌ను నడిపిన ఈ కేసులో మరో పురోగతి కనిపించింది.
ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథ కలకలం: తెలంగాణ ఆవిర్భావంపై కీలక వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదే

మరో ముగ్గురి అరెస్ట్..
ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్న మరో ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కొద్దిసేపటి కిందటే ఈ విషయాన్ని వెల్లడించారు. పొల్లాచ్చిలోకి వడుగపాళయానికి చెందిన కే అరుళనందం, పీ బాలు, అచ్చిపట్టికి చెందిన టీ హెరినె పాల్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వారిలో అరుళనందం.. అధికార ఏఐఏడీఎంకేకు చెందిన నాయకుడు. అన్నా డీఎంకే పొల్లాచ్చి విద్యార్థి విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

ఈ రాకెట్ గుట్టు ఏంటీ?
పొల్లాచ్చికి చెందిన కొందరు యువకులు ఈ రాకెట్‌ను నడిపించారు. 2019లో వారి చేతిలో అత్యాచారానికి గురైన 19 సంవత్సరాల విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వారి డొంక కదిలింది. పొల్లాచ్చికి చెందిన ఆ యువతితో శబరీ రాజన్ అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఫోన్ నంబర్ తీసుకొని కొన్ని రోజులపాటు తన మాయమాటలతో ఆమెను నమ్మించాడు. అతణ్ని నమ్మిన ఆమెపై రాజన్ తన స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు. దాన్ని వీడియో తీశాడు. డబ్బులు ఇవ్వాలని లేదంటే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరిస్తుండే వాడు.

సెల్ ఫోన్ నిండా అశ్లీల వీడియోలు..
ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫిబ్రవరి 25న శబరిరాజన్ సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దర్యాప్తు సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. సెల్‌ఫోన్లల్లో అనేకమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ వాళ్లు స్వయంగా చిత్రీకరించినవే కావడం.. ఒక్కో వీడియోలో వేర్వేరు మహిళలు ఉండటంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. మార్చి 5న ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు తిరునవుక్కరసుని అరెస్ట్ చేశారు.

బాధితుల్లో విద్యావంతులు కూడా..
వాహనాలు, హోటల్ గదులు, ఫామ్‌హౌస్‌లో ఈ నలుగురు యువతులపై అత్యాచారాలకు పాల్పడేవారు. చెన్నై, కోయంబత్తూరు, సేలం ఇలా తమిళనాడులోని అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థినిలు, టీచర్లు, డాక్టర్లు, సాధారణ గృహిణులు ఇలా వందమందికి పైగా అత్యాచార బాధితుల్లో ఉన్నట్లు తేలింది. ఈ సెక్స్ రాకెట్‌లో ఇప్పటికే తిరునావుక్కరసు, ఎన్ శబరిరాజన్ అలియాస్ రిష్వంత్, ఎన్ సతీష్, టీ వసంతకుమార్, ఆర్ మణివన్నన్‌లను అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అన్నా డీఎంకే నేత నాగరాజ్ ఇదివరకే సస్పెండ్ అయ్యారు.

ఎన్నికల సమయంలో..
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్న ప్రస్తుత పరిస్థితుల్లో పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసులో ఏఐఏడీఎంకేకు చెందిన మరో నాయకుడు తాజాగా అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. ఇదివరకే సీఐడీ ఆధీనంలో ఉన్న ఈ కేసును సీబీఐకి బదలాయించడంలో డీఎంకే కీలక పాత్ర పోషించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించడంతో ఈ కేసు సీబీఐకి అప్పగించింది. రెండో సారి కూడా అన్నా డీఎంకే చెందిన నాయకుడు సీబీఐ చేతికి చిక్కడంతో.. ఆ పార్టీకి చెందిన మరింత మంది ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దీన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా డీఎంకే తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.