జాతర అయ్యేవరకు ఛాన్స్ ఇవ్వలే, వైసీపీ నేత పార్థసారథి సూసైడ్‌పై చంద్రబాబు
కుప్పం వైసీపీ నేత పార్థసారథి ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆత్మహత్య బాధాకరం అని బహిరంగ లేఖ రాశారు. వైసీపీ నేతల వేధింపులకు.. చివరకు సొంత పార్టీ నేతలు కూడా బలవుతున్నారని మండిపడ్డారు. పార్థసారధి ఆత్మహత్యకు కారకులైన వారిపై ఇప్పటివరకు ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. సూసైడ్ సెల్ఫీ వీడియోలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులకి పదవులు అనే విష సంస్కృతి కుప్పంలో తీసుకువచ్చారని వాపోయారు.

ఆత్మహత్య ఇందుకే..?
కుప్పం నియోజకవర్గం కుప్పం గ్రామంలో గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్‌గా పని చేసిన వైసీపీ నేత పార్థసారథి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇదీ స్థానికంగా వైసీపీలో కలకలం రేపుతోంది. వైసీపీ నేతల తీరుతోనే పార్థసారథి మృతి చెందాడనే చర్చ సాగుతుంది. కుప్పం మున్సిపాలిటీ కాక ముందు వార్డు సభ్యునిగా రెండు సార్లు పనిచేశారు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేశాడు. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు అవకాశం లభించలేదు. తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీలో మరోసారి అవకాశం లేదని స్పష్టం కావడంతో పార్థసారథి తీవ్ర మనస్థాపానికి గురయ్యడు. ఇందుకోసమే ఆత్మహత్య చేసుకున్నారనే వాదన వినిపించింది.

సెల్పీ వీడియో..
పార్థసారథి ఆత్మహత్య వ్యవహారంపై సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. తన ఆత్మహత్యకు గల కారణాలను పార్థసారథి వెల్లడించారు. కుప్పం గంగమ్మ ఆలయ చైర్మన్‌గా రెండేళ్లు కొనసాగినా.. కరోనా కారణంగా జాతర చేయలేక పోయాయని పేర్కొన్నారు. మరో నెలలో రానున్న జాతర జరిపించి పదవీ నుంచి దిగిపోతానని వైసీపీ నేతలకు చెప్పినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

రూ.35 లక్షలు ఖర్చు
గంగమ్మ గుడి చైర్మన్ పదవి కోసం రూ.35లక్షలు ఖర్చు చేశానని, పదవి ఇచ్చినందుకు రూ. 15 లక్షలు ఖర్చు చేశానని, బోర్డు ఏర్పాటు కోసం రూ. 10లక్షలు, ఆలయంలో మరమ్మతుల కోసం మరో పది లక్షలు అప్పు చేసి డబ్బులు వెచ్చించానని వీడియోలో వెల్లడించాడు. ఇప్పటికీ తెచ్చిన డబ్బులకు వడ్డీ కడుతున్నానని అన్నారు. ఏడేళ్లుగా వైసీపీని నమ్ముకున్న తన వద్ద కూడా డబ్బులు తీసుకునే పదవి ఇచ్చారని తెలిపారు. కొత్తగా పార్టీలోకి వస్తున్న నాయకుల వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకుని పదవులు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పార్థసారథి సెల్ఫీ వీడియో స్థానిక వైసీపీలో కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications