హైదరాబాద్ నాలాలో కొట్టుకొచ్చిన మొసలి.. భయాందోళనలు
హైదరాబాద్: మరోసారి భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలానికి గురి చేసింది. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఫలితంగా దాదాపు అన్ని రూట్లల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది.
ఉప్పల్, నాగోల్, అత్తాపూర్, ఎల్బీ నగర్, దిల్‌సుక్ నగర్, మలక్ పేట్, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. సోమాజిగూడ, పంజాగుట్ట, చింతల్, బాలానగర్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, రాజేంద్రనగర్, నారాయణగూడ, మల్కాజ్‌గిరి, లక్డీకాపుల్, కోఠి తదితర ప్రాంతాలలో ఏకధాటిగా భారీ వర్షం పడింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలకు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది.
కాగా ఈ పరిస్థితుల్లో ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని చింతల్ బస్తీలో భయాందోళనలు నెలకొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చింతల్ బస్తీ నాలాలో ఓ మొసలి కొట్టుకుని రావడం కనిపించింది. చింతల్ బస్తీ నాలా ఒడ్డుకు చేరిన ఆ మొసలిని స్థానికులు గుర్తించి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
జీహెచ్ఎంసీ అధికారులు దాన్ని బంధించి నెహ్రూ జులాజికల్ పార్క్‌నకు తరలించారు. ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం ఆరా తీస్తోన్నారు. నగర శివార్ల నుంచి ఇది వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తోన్నారు. మొసళ్లు ఇంకా ఎన్ని ఉన్నాయనేది తెలియరావట్లేదు. తమ ప్రాంతంలో మొసలి కనిపించడంతో చింతల్ బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications