దూసుకొచ్చిన పెంపుడు కుక్క: మూడో అంతస్తు నుంచి దూకేసిన డెలివరీ బాయ్
హైదరాబాద్: గత కొంత కాలంగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. వీధి కుక్కలతోపాటు పెంపుడు కుక్కలు కూడా మనుషులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా, ఓ పెంపుడు కుక్క దాడిలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం మణికొండ పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్‌పై ఒక్కసారిగా పెంపుడు కుక్క దూసుకొచ్చింది.
శునకాన్ని చూసి భయపడిపోయిన డెలివరీ బాయ్ మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డెలివరీ బాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, ఇటీవల హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు మహ్మద్ రిజ్వాన్(23). యూసఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్(23) మూడేళ్లుగా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కాగా, ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు అతడు తలుపు తట్టగానే ఇంట్లో ఉన్న జర్మన్ షెపర్డ్ కుక్క మొరుగుతూ దూసుకురావడంతో రిజ్వాన్ భయపడిపోయాడు.
అక్కడ్నుంచి పరుగెత్తుకుంటూ మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. తీవ్రగాయాలు కావడంతో గమనించిన యజమాని శోభన వెంటనే అంబులెన్స్‌లో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇంటి యజమాని నిర్లక్ష్యంతో వల్లే తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితిలోకి చేరుకున్నాడని బాధితుడి సోదరుడు మహ్మద్ ఖాజా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మళ్లీ తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో డెలివరీ బాయ్‌లు ఫుడ్ డెలివరీ చేయాలంటేనే భయపడిపోతున్నారు. ముందుగానే ఫోన్ చేసి కుక్కలు ఉన్నాయా? అని అడిగి వెళుతున్నారు. కాగా, పెంపుడు కుక్కల యజమానులు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications