మైండ్ గేమ్ మొదలెట్టిన బీజేపీ ... కూతురితో మొదలెట్టి అల్లుడు, తనయుడికీ షాక్ .. నెక్స్ట్ కేసీఆర్ నే అంటూ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. వంద స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన టిఆర్ఎస్ పార్టీ కేవలం 55 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలను సంపాదించిన బిజెపి ఈసారి 48 స్థానాలను చేజిక్కించుకుని గ్రేటర్లో సత్తా చాటింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బిజెపినే ఉందని బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపింది.
గ్రేటర్ లో గులాబీ హవా.. పాలాభిషేకాలు , సంబరాలు షురూ .. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్ దే ..

కౌంట్ డౌన్ మొదలైందని మైండ్ గేమ్ మొదలు పెట్టిన బీజేపీ
మొన్నటి దుబ్బాక ఎన్నికల ఫలితం, ఇక తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో జోష్ ను పెంచాయి . తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ పావులు కదపటానికి ఊతం ఇచ్చాయి. దీంతో బిజెపి భవిష్యత్తు ఎన్నికలకు ఇప్పటి నుంచే మైండ్ గేమ్ మొదలెట్టేసింది. టిఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందని, కౌంట్ డౌన్ ప్రారంభమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం మొదలెట్టేశారు. అసలు ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే మేయర్ పీఠం తమకే దక్కుతుందని కిషన్ రెడ్డి వంటి నేతలు చెప్పారు.

తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాషాయ జెండానే అంటున్న బీజేపీ నేతలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం అంటూ ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టిన బిజెపి నేతలు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ప్రజలకు కాషాయ జెండాను చూపిస్తున్నారు . గత ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో అసహనం ఉన్నా వారికి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కనిపించక, టిఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా, అధికార పార్టీకి చెక్ పెట్టే బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని బీజేపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల విజయాలను పావులుగా వాడుతున్న బీజేపీ నేతలు
వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం, గ్రేటర్ ఎన్నికల విజయాలను పావులుగా వాడుతున్నారు.
ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటం కోసం బీజేపీ ఉందని, బీజేపీకి పట్టం కట్టాలని ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. 2023 లో కారు సారు ఇక రారు అంటూ వ్యాఖ్యానిస్తూ ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. కెసిఆర్ ను కేటీఆర్ ను ప్రజలు తిరస్కరించారని బలంగా చెప్తున్నారు. టిఆర్ఎస్ పార్టీపై సాఫ్రాన్ స్ట్రైక్ చేశామంటూ బండి సంజయ్ పేర్కొన్నారు .

కూతురితో మొదలై , అల్లుడికి ఝలక్ ఇచ్చి కొడుక్కీ షాక్ .. నెక్స్ట్ కేసీఆర్ నే .. మైండ్ గేమ్ షురూ
బిజెపి నేతలు నిజామాబాద్ లో కూతురు ఓటమితో ప్రారంభమైన పతనం అలాగే కొనసాగుతుందని అంటున్నారు. దుబ్బాకలో బిజెపి విజయం సాధించడంతో కెసిఆర్ అల్లుడు హరీష్ రావుకు చెక్ పెట్టామని, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొడుకు కేటీఆర్ కు చెక్ పెట్టామని , రానున్న ఎన్నికలలో కెసిఆర్ కు చెక్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తాం అని ప్రచారం మొదలు పెట్టారు. ఏది ఏమైనా టిఆర్ఎస్ నేతలకే కాదు, తమకు కూడా మైండ్ గేమ్ ఆడటం వచ్చు అని నిరూపిస్తున్న బిజెపి నేతలు ఇప్పటి నుండే భవిష్యత్తు ఎన్నికలకు కావలసిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. తమకు తిరుగు లేదనుకున్న
అధికార టీఆర్ఎస్ కు చెమటలు పట్టిస్తున్నారు .