Garuda prasadam: మొన్న చిలుకూరు బాలాజీ..మళ్ళీ బాలాపూర్ లక్ష్మీనరసింహస్వామి..గరుడ ప్రసాదం, ఎప్పుడంటే
మొన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో నిర్వహించిన గరుడ ప్రసాద వితరణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించడంతో ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. దీంతో చిలుకూరు బాలాజీ ఆలయ సమీప పరిసరాలన్నీ ట్రాఫిక్ జామ్ తో ఆ రోజంతా ఇబ్బంది పడిన విషయం కూడా తెలిసిందే.
మళ్ళీ గరుడ ప్రసాదం
అయితే ఇక తాజాగా హైదరాబాద్లోని బాలాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా మళ్లీ గరుడ ప్రసాద వితరణ తెరమీదకు వచ్చింది. బాలాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా మే 2న ఉదయం 9 గంటలకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ జయరాం ఆచార్యులు తెలియజేశారు.

సంతానం లేని దంపతులు సంతాన భాగ్యం కోసం గరుడ ప్రసాదం
సంతానం కోసం బాధపడుతున్న దంపతులు ఎవరైతే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో.. వారికి స్వామి అనుగ్రహంతో సంతాన భాగ్యం కలుగుతుందని ఆయన వెల్లడించారు. అయితే ప్రసాదాన్ని స్వీకరించాలి అనుకునే దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో, ఉపవాసంతో ఆలయానికి చేరుకోవాలని వారు సూచించారు. గరుడ ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తే సంతానం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం.. ట్రాఫిక్ జామ్
మొన్నటికి మొన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పెట్టిన గరుడ ప్రసాదం అక్కడికి వచ్చిన భక్తులందరికీ సరిపోలేదు. చాలామంది భక్తులు గరుడ ప్రసాదం దొరకక నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోయారు. గరుడ ప్రసాదం కోసం చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చిన భక్తులతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.
గరుడ ప్రసాదం తీసుకునేవారు, వితరణ చేసేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే
ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ బాలాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గరుడ ప్రసాద వితరణ జరగనున్న క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులు గరుడ ప్రసాద వితరణ, అనేక ఆలయాలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తప్పక జరుగుతుంది అనే విషయం గుర్తుంచుకుంటే మంచిది. ఇక గరుడ ప్రసాద వితరణ చేయనున్న ఆలయ సిబ్బంది ఇటీవల చిలుకూరు ఆలయంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటే ఇంకా మంచిది.












Click it and Unblock the Notifications