విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డులు: ఎన్ని మెగావాట్లంటే?
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రాష్ట్ర చరిత్రలో మంగళవారం(మార్చి 14న) అత్యధిక విద్యుత్ వినియోగించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రాష్ట్ర చరిత్రలో మంగళవారం(మార్చి 14న) అత్యధిక విద్యుత్ వినియోగించినట్లు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఉదయం 10.30 గంటల వరకే 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగించినట్లు తెలిపారు.
కాగా, సోమవారం 14,138 మెగావాట్ల కరెంట్ వాడకం జరిగినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు, ప్రజల వినియోగం కూడా పెరగడంతోనే విద్యుత్ డిమాండ్ భారీగా ఉంటోందని చెప్పారు. గత సంవత్సరం ఇదే రోజున 12,727 మెగావాట్ల గరిష్ట్ డిమాండ్ నమోదైంది.

తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ మంగళవారం నాటికి 9121 మెగావాట్లు, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 5738 మెగావాట్లు విద్యుత్తు వినియోగించారు. వేసవికాలం ముగిసేసరికి 16,000 మెగావాట్ల రికార్డ్‌ను దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వేసవిలో రైతులతో పాటు వినియోగదారులందరికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్తు శాఖ చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. మొత్తం విద్యత్తు వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికి ఉపయోగించనున్నారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడు తర్వాత తెలంగాణనే ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈసారి ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications