రాజమౌళిని అభినందించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: హెల్త్ హబ్‌గా తెలంగాణ.. గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. బంజారాహిల్స్‌లో లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధిస్తోందని తెలిపారు. 10వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం వైద్యరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌లను గాంధీ, నిమ్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో గాంధీలో సేవలు ప్రారంభమవుతాయన్నారు.

వైద్య సేవలు అందించే విషయంలో కార్పొరేట్ ఆస్పత్రులతో రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడుతున్నాయన్నారు మంత్రి హరీశ్ రావు. 2014లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే.. ఇప్పుడు అది 70 శాతం పెరిగాయని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సల్లో తెలంగాణ దేశంలో నెంబర్ 1గా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. ఎనీమియా తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించబోతున్నామన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని మంత్రి తెలిపారు.
రాజమౌళిని అభినందించిన హరీశ్ రావు
సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేశారని హరీశ్ రావు కొనియాడారు. ఈ సందర్భంగా ఆస్కార్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన హరీశ్ రావు.. రాజమౌళిని అభినందించారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు ఖ్యాతిని నలుదిశలా చాటారన్నారు. ఇక, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో పేషెంట్ కేర్, సెక్యూరిటీ, ఇతర సేవలకు సంబంధించిన ఖర్చులను రెండేళ్లపాటు భరించనున్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ముందుకొచ్చారన్న మంత్రి హరీశ్ రావు.. ఇది అభినందనీయమని ప్రశంసించారు.
హరీశ్ రావుకు ఫ్యాన్ అంటూ రాజమౌళి
మరోవైపు, రాజమౌళి మంత్రి హరీశ్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు. సిద్దిపేట అభివృద్ధి చూసినప్పటి నుంచి తాను హరీశ్ రావుకు ఫ్యాన్ అయ్యానని చెప్పారు రాజమౌళి. గతంలో చూసినప్పటికీ.. ఇప్పటికీ సిద్దిపేటలో చాలా అభివృద్ధి జరిగిందని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిలో మంత్రి హరీశ్ రావు కృషి తెలిశాక.. తాను మంత్రి అభిమానిగా మారానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.












Click it and Unblock the Notifications