మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు: తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షం నగరజీవిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. లోతట్టు ప్రాంతాలు, రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి.
మరోవైపు, హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోని ప్రజలు బయటికి వెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు వచ్చే వారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ 'ఎల్లో' హెచ్చరికను జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల్లో రుతుపవనాల వ్యవస్థ మరింత ఉధృతమవుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు.
కాగా, సోమవారం హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటల వ్యవధిలోనే ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర, వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు బలంగా వీస్తున్నాయని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications