Onion Price: కొయ్యకుండానే కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి..!
ఉల్లి ధర భారీగా పెరిగిపోతోంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో కిలో ఉల్లి రూ.70 పలుకుతోంది. నెల రోజుల క్రితం కిలో ఉల్లి రూ.25 నుంచి రూ.30 గా ఉంది. ఉల్లి ఎగుమతులపై సుంకం ఎత్తివేయడంతో దేశీయంగా ధరలు భారీగా పెరిగాయి. దిగుబడి తగ్గడం కూడా ఉల్లి ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని రైతు బజార్ల ధరల పట్టిక ప్రకారం ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు.
రిటైల్ మార్కెట్ లో ఉల్లి కిలోకు రూ.70కి పైగా పలుకుతోంది. తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంట నష్టం కారణంగా ఉల్లి ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. దీంతో చాలా మంది ఉల్లి వాడడం తగ్గించేశారు. ఉల్లిని తప్పక వాడాల్సిన వంటల్లోనే వాడుతున్నారు. అందుకే కిలో తీసుకెళ్లేవారు అరో కిలో తీసుకెళ్తున్నారు. ఇక మిర్చి బండి వద్ద ఉల్లి ఇవ్వడం లేదు. పానీ పూరీ బండి వద్ద కొంచెం మాత్రం ఉల్లి ఇస్తున్నారు.

మలక్‌పేట్, బోయిన్‌పల్లి, మూసాపేట్, గుడిమల్కాపూర్‌తో సహా హైదరాబాద్‌లోని ప్రధాన ఉల్లి మార్కెట్‌లకు రాక గణనీయంగా తగ్గడంతో ధరలు పెరుగుతోన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఉల్లి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మార్కెట్ లోకి బఫర్ స్టాక్ ను విడుదల చేసింది.
అలాగే నాఫేడ్ ద్వారా తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారు. కిలో రూ.35 లకే అమ్ముతున్నారు. అయితే నాఫేడ్ వాహనాలు రైతు బజార్ల వద్దు, కూరగాయ మార్కెట్ల వద్ద అందుబాటులో ఉండనున్నాయి. నాఫేడ్ ద్వారా ఒక్కరి ఒక కిలో విక్రయిస్తున్నారు. ఇక వెల్లుల్లి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. వెల్లుల్లి కిలో రూ.400 నుంచి రూ.500 పలుకుతోంది.












Click it and Unblock the Notifications