తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.
ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం యథాతధంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

నామినేషన్ల స్వీకరణ: జనవరి 8 నుంచి 10 వరకు
నామినేషన్ల పరిశీలన: జనవరి 11
నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 14
మున్సిపల్ ఎన్నికలు: జనవరి 22
ఓట్ల లెక్కింపు: జనవరి 25న
ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..
తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందంటూ, ఎన్నికలను వాయిదా వేయాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక(మున్సిపల్) ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ నోటిఫకేషన్ ఆదివారం జారీ అయ్యింది. మేయర్, ఛైర్ పర్సన్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 7,8 ఉత్తర్వులను పురపాలక శాఖ విడుదల చేసింది.
ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. 120 పురపాలక సంఘాలు, 10 నగర పాలక సంస్థలకు ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వార్డులను రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేసింది. బీసీలకు 29.40 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 5.83 శాతం, ఎస్సీలకు 14.15 శాతం దక్కాయి. కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్లు జనరల్(మహిళ): గ్రేటర్ హైదరాబాద్, బోడుప్పల్, బడంగ్ పేట్, కరీంనగర్ జనరల్: పీర్జాదిగూడ, నిజాంపేట్, ఖమ్మం బీసీ(మహిళ): నిజామాబాద్, జవహర్ నగర్ ఎస్సీ: రామగుండం ఎస్సీ: మీర్‌పేట












Click it and Unblock the Notifications