హైదరాబాద్‌లో భారీ వర్షం: నీటమునిగిన అంబర్‌పేట్- మూసారాంబాగ్ బ్రిడ్జి, గండిపేట గేట్లు ఎత్తివేత
హైదరాబాద్: నగరంలో శనివారం కూడా భారీ వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నగరంలోని అనేక ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం సమయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలకు రోడ్లు నీటమునిగాయి. ఇక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది.
అంబర్‌పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, లంగర్‌హౌస్, కార్వాన్, మెహదీపట్నం, మీర్ పేట, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జోరు వానల ధాటికి మలక్‌పేట్ రహదారిలో ఐదు అంబులెన్స్ లు చిక్కుకుపోయాయి. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.. ఇతర వాహనాలను ఓ పక్కకు పంపించి.. అంబులెన్స్ లను అక్కడ్నుంచి వెళ్లేలా చేశారు.

గండిపేటకు భారీగా వరద నీరు చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గండిపేటకు పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మూసీ పరివాహ ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అంబర్‌పేట్- మూసారాంబాగ్ వంతెన నీటమునిగింది. పరివాహ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరో మూడు రోజులపాటు వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఆవర్తనం శనివారం ఈశాన్య & పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొలదీ దాక్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది.
ఈ ఆవర్తన ప్రభావంతో ఉత్తర, పరిసర మధ్య బంగళాఖాతంలో రాగల 48 గంటలలో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శనివారం ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర మట్టంకి 2.1 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుంది.
షియర్ జోన్ 12° ఉత్తర లాటిట్యూడ్ వెంబడి సముద్ర మట్టానికి 5.8 కి మీ నుండి 7.6 కి మీ మధ్య కొనసాగుతుంది. శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం, ఆదివారం భారీ వర్షాలు ఒకటి,రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు వున్నవి. రాగల 3 రోజులు ఉరుములు , మెరుపులుతో కూడిన వర్షములు చాలా ప్రదేశములో వచ్చే అవకాశములు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదవుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రహదారులు భారీగా దెబ్బతింటున్నాయి. పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.












Click it and Unblock the Notifications