అఫ్గానిస్తాన్: షరియా అంటే ఏంటి, ఈ చట్టం మహిళల గురించి ఏం చెబుతోంది?

ఖురాన్ చదువుతున్న విద్యార్థి

ఇస్లాం న్యాయ వ్యవస్థ అయిన షరియా చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయడం ద్వారా అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తామని కాబుల్‌లో వశపర్చుకున్నాక ఏర్పాటు చేసిన మొదటి విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

పత్రికా స్వేచ్ఛ, మహిళల హక్కులకు షరియా చట్ట పరిధిలోనే గౌరవిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి అన్నారు. అయితే, షరియా చట్టం అమలు ఎలా ఉంటుందనే విషయంలో వారు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

షరియా అంటే ఏమిటి?

షరియా అంటే ఇస్లాం న్యాయవ్యవస్థ. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు రూపొందించిన ఫత్వాల (ఆదేశాలు) ఆధారంగా దీనిని రూపొందించారు.

వాచ్యార్థంలో తీసుకుంటే, "నీటి వద్దకు వెళ్లే స్పష్టమైన, నిర్దిష్టమైన మార్గమే' షరియా.

ముస్లింలు తమ జీవితంలో వేసే ప్రతి అడుగునీ, ఆచరించే ప్రతి పనినీ ఈ చట్టంలో పొందుపరిచిన నియమాలను అనుసరించే చేయాలి. అంటే, వారి జీవన విధానం అంతా వారు పొద్దున్న లేచి చేసే ప్రార్ధనల నుంచీ పర్వదినాల్లో పాటించే ఉపవాసాలు, పేదలకు చేసే దానాల వరకు అన్నీ ఈ చట్టానికి లోబడే ఉంటాయి.

పురుషులు, మహిళలు నిండుగా వస్త్రాలు ధరించాలని షరియా ఆదేశిస్తుంది.

ఇస్లాంలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి, అందులో మొదటిది భగవంతుడు, మానవుల సృష్టి, మరణానంతరం జరిగే పరిణామాలు.

రెండవది పూజ లేదా ప్రార్థన, ఉపవాసాలు, దానాలు, యాత్రలు మొదలైనవి.

మూడవది చట్టం.

ఇందులో, దొంగతనం, అత్యాచారం, హత్యల్లాంటి నేరాలకు విధించే శిక్షలు, వివాహం, విడాకులు, వారసత్వ హక్కులను నిర్దేశించే కుటుంబ చట్టాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇస్లాంలో ఉన్న ఈ చట్టాలన్నింటినీ కలిపే షరియా అని అంటారని ఇస్లామిక్ అకాడెమీ ఫర్ కంపారిటివ్ రెలీజియన్ అధ్యక్షుడు అసీఫుద్దీన్ ముహమ్మద్ బీబీసీకి వివరించారు.

ముస్లిం మతస్థులు తమ జీవితాన్ని భగవంతుని ఇష్టాలకనుగుణంగా గడిపే విధానాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడటమే ఈ చట్టం లక్ష్యం.

ముస్లింల దైనందిన జీవితంలో షరియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షరియా చట్టంలో ముస్లింల దైనందిన జీవితాల్లో ఇమిడి ఉన్న అంశాల గురించి అసీఫుద్దీన్ ముహమ్మద్ బీబీసీకి వివరించారు.

ప్రార్ధన

ప్రార్ధన అంటే పూజించడం. ముస్లింలందరూ రోజుకు అయిదు సార్లు ప్రార్ధన చేయాలి. ప్రార్ధన చేయలేని వారిని పాపం చేసినవారిలా షరియా చట్టం చూస్తుంది.

అయితే, ప్రార్ధన చేయనందుకు ఖురాన్ లో గానీ, సున్నాహ్ లో గానీ ఎటువంటి శిక్షలు లేవు. కొన్ని ప్రభుత్వాలు ప్రార్ధన సమయంలో ప్రజలను రోడ్ల పై నడవడాన్ని నిషేధించాయి.

కానీ, ఇస్లాం మాత్రం మనిషి భగవంతునికి తనను తాను ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలని చెబుతుంది.

అయితే, "మతంలో ఎటువంటి నిర్బంధాలు లేవు" అని ఖురాన్ లో శ్లోకాలు చెబుతున్నాయని అసీఫుద్దీన్ తెలిపారు.

ముస్లింలు విద్య భ్యసించవచ్చా?

ముస్లింలు తమకిష్టమైన విద్యనభ్యసించవచ్చు. ఆసక్తి ఉన్న కళల్లో నైపుణ్యం సంపాదించవచ్చు.

వ్యాపారం, పరిశోధన, సాంకేతిక రంగాలను వృత్తులుగా ఎంచుకోవడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది.

ఖురాన్ చదువుతున్న విద్యార్థి

ఎటువంటి ఆహారం తినాలి?

హలాల్ గురించి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. హలాల్ అంటే ఆమోదం పొందినది అని అర్ధం.

అన్ని కాయగూరలూ, కోడిగుడ్లు, సముద్ర ఆహార ఉత్పత్తులు తినడానికి ఆమోదయోగ్యమైనవే.

అయితే, జంతు మాంసం తినేటప్పుడు మాత్రం ముస్లింలు ఆ మాంసం హలాల్ చేసిందా కాదా అని మాత్రం చూసుకోవాలి.

బ్రహ్మచర్యం పాటించకూడదా?

ఇస్లాం ననుసరించి ముస్లింలు బ్రహ్మచర్యాన్ని పాటించడం, సన్యసించడం నిషేధం. మనుషులంతా సాధారణ ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూ, శాశ్వతమైన లక్ష్యాన్ని చేరే విధంగా జీవించాలి.

విందులకు హాజరు కావచ్చా?

ఎందుకు కాకూడదు? ముస్లింలు నిరభ్యంతరంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పార్టీలకు హాజరు కావచ్చు. అయితే, సాధారణ సమయంలో నిషేధమైనవే పార్టీల సమయంలో కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు పార్టీల్లో పొగ తాగడం, మద్యపానం సేవించడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు.

అయితే, పార్టీలకు వెళ్ళినప్పుడు పురుషులు ఇతర కుటుంబాలకు సంబంధించిన మహిళలతో మాట్లాడకూడదు. ఇదే ఇతర మతాల వారికీ ముస్లింలకు ఉన్న ప్రధానమైన తేడా. తమ సొంత కుటుంబంలోని మహిళలతో మాత్రమే మాటలైనా, వినోదమైనా సరే.

అయితే, ఉద్యోగాలకు బయటకు వెళ్లే వారు మాత్రం హద్దులు దాటకుండా మహిళా సహోద్యోగులతో మాట్లాడవచ్చు.

మలేషియా షరియా హైకోర్టులో తొలి మహిళా జడ్జి నెన్నే సుషాయిదా

షరియా మహిళల వస్త్రధారణ గురించి ఏమి చెబుతోంది?

షరియా చట్టాన్ని అనుసరించి మహిళలు శరీరమంతా కప్పే వస్త్రాలు ధరించాలి. మహిళలు, హిజాబ్ లేదా బుర్ఖా ధరించాలి.

మహిళలు ఎటువంటి వేధింపులకు గురి కాకుండా ఉండేందుకే ఈ నిబంధనను రూపొందించడం వెనుకనున్న ఉద్దేశ్యమని ఖురాన్ లో కూడా ఉన్నట్లు అసీఫుద్దీన్ చెప్పారు.

బుర్ఖా ధరించి మహిళలు తమకు నచ్చిన వృత్తిని చేపట్టవచ్చు.

డ్రైవింగ్, వివిధ కళలు, విద్యారంగంలో బుర్ఖా ధరించిన మహిళలను చాలా మందిని చూస్తున్నాం అని అసీఫుద్దీన్ అన్నారు.

ముస్లిం అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్, ఫుట్ బాల్, పరుగు పందేలు, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడల్లో అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. పతకాలు కూడా సంపాదిస్తున్నారు అని చెప్పారు.

వివాహాల గురించి షరియా ఏమి చెబుతోంది?

ముస్లిం వివాహాల్లో నిఖా తప్పనిసరి. ఇది జరగని పక్షంలో వివాహానికి ఇస్లాంలో చట్టబద్ధత ఉండదు.

అలాగే, ముస్లింలు అరబిక్ భాషలో విడాకులు తీసుకుంటున్నట్లు తలాఖ్ అనే పదాన్ని మూడు సార్లు చెబితే చాలని, అది వారి హక్కు అని అనుకుంటారు. కానీ, ఆచరణలో మాత్రం విడాకులనే ఒక సుదీర్ఘమైన ప్రక్రియలో ఈ తలాఖ్ చెప్పడం అనేది ఒక చిన్న భాగం మాత్రమేనని అంటారు.

ఇస్లాం ప్రకారం వివాహం అనేది ఒక కాంట్రాక్టు. విడాకుల గురించి షరియా చట్టంలో విరుద్ధమైన అభిప్రాయాలతో కూడిన క్లిష్టమైన విశ్లేషణాలున్నాయి.

ఇంటర్నెట్ వాడవచ్చా?

ఖురాన్, సున్నాహ్ లో నిషేధించిన అంశాలు తప్ప మిగిలినవేవైనా ముస్లింలు పాటించవచ్చు. అంటే, ముస్లింలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీడియాను వాడవచ్చు. టీవీ చూడవచ్చు. వార్తాపత్రికలు చదవవచ్చు. వీటికి ఎటువంటి అభ్యంతరాలు లేవూ. అయితే, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, నేరాలకు పాల్పడటం లాంటివి చేయనంతవరకూ అన్ని ఆధునిక టెక్నాలజీలను వాడవచ్చని ఆసీఫుద్దీన్ చెబుతున్నారు.

అయితే, అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనపరుచుకున్న నేపథ్యంలో, వారి భావాలకనుగుణంగా, టీవీ ని నిషేధిస్తారేమోనని పలువురు భయపడుతున్నారు.

గతంలో తాలిబన్లు అఫ్గానిస్తాన్ ను పరిపాలించినప్పుడు ఆ దేశంలో ప్రజలు టీవీ చూడటాన్ని నిషేధించారు. అలాగే, సంగీతం వినడం, పార్టీలకు వెళ్లడాన్ని కూడా తాలిబాన్లు నిషేధించారు.

నేరాల గురించి ఏమి చెబుతోంది?

షరియా చట్టం నేరాలను హద్ నేరాలు (కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలు) , తాజిర్ నేరాలని (న్యాయాధిపతి నిర్ణయం మేరకు విధించే శిక్ష) రెండు రకాలుగా వర్గీకరిస్తుంది.

దొంగతనం, వ్యభిచారం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి.

దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలుంటాయని చెబుతారు. అయితే, ఈ శిక్షలు విధించడానికి చాలా బలమైన సాక్ష్యాలుండాలని కొన్ని ఇస్లామిక్ సంస్థలు చెబుతాయి.

రాళ్లతో కొట్టి చంపడాన్ని ఐక్యరాజ్య సమితి క్రూరమైన అమానవీయ చర్యగా అభివర్ణించి వీటిని నిషేధించింది.

అయితే, ఇలాంటి శిక్షలను అన్ని ముస్లిం దేశాలు అమలు చేయవు.

ఇండొనేసియా

మతమార్పిడి నేరమా?

మతమార్పిడిని ముస్లింలు నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మరణశిక్షే సరైనది అని భావిస్తారు.

అయితే, ఇలాంటి నేరాలకు శిక్షను భగవంతుని పైనే వదిలేయాలని కొంత మంది ఆధునిక ముస్లిం నిపుణులు అంటారు.

మతంలో నిర్బంధం లేదని ఖురాన్ లోనే స్వయంగా ఉందని అంటారు.

ఈ నియమావళిని ఎవరు రూపొందిస్తారు?

షరియా చట్టం సంక్లిష్టమైనది. దీనిని ఆచరించడం పూర్తిగా నిపుణులు తీసుకున్న శిక్షణ, నైపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ న్యాయవేత్తలు షరియా నియమావళిని, ఆదేశాలను జారీ చేస్తారు. ఈ నియమావళిని చట్టబద్ధం చేస్తే ఫత్వా అంటారు.

షరియా చట్టంలో మొత్తం అయిదు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో హంబలీ, మాలికీ, షఫీ, హనాఫీ, అనే నాలుగు సున్నీ సిద్ధాంతాలు, జాఫరీ అనే షియా సిద్ధాంతం ఉంది. షరియా చట్టానికి మూలంగా పరిగణించిన మూలగ్రంథాలలోని అంశాల పై వివిధ వర్గాల వారు చేసే విశ్లేషణల ఆధారంగా నియమావళిలో తేడాలుంటాయి.

పాశ్చాత్య చట్టాలకు షరియాకు తేడా ఏంటి?

పాశ్చాత్య చట్టాలలో పూర్తిగా నేర సంబంధిత విషయాలు, పౌర సంబంధాలు, వ్యక్తిగత హక్కులకు సంబందించిన నియమావళి ఉంటే, షరియాలో ముస్లింలు భగవంతుని ఆదేశాలకనుగుణంగా జీవించేందుకు సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి.

పాశ్చాత్య దేశాల్లో కూడా ముస్లింల కోసం షరియా న్యాయస్థానాలుంటాయి. వీటిని ముఖ్యంగా, కుటుంబ, వ్యాపార వ్యవహారాల కోసం ఏర్పరుచుకున్నారు.

ఆధునిక అంశాలైన ఇన్సూరెన్స్ , అవయవ దానం లాంటి అంశాలపై కొంత మంది ఇస్లాం పండితులు తమ సొంత విశ్లేషణ ద్వారా ముస్లింలు పాటించాల్సిన మార్గాలను సూచిస్తారు.

షరియా చట్టం పురోగమన దిశలోనే మార్గదర్శకాలను ఇస్తుందని, ముస్లింలంతా ఈ చట్టాన్ని ఇష్టంగానే ఆచరిస్తారని అసీఫుద్దీన్ అన్నారు.

షరియా చట్టం 7వ శతాబ్దంలోనే మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇచ్చిందని అసీఫుద్దీన్ చెబుతారు. ఉదాహరణకు శిశుహత్య చేయడాన్ని నిషేధించడం, అత్యాచారాలకు మరణ శిక్ష విధించడం, పురుషులతో సమానంగా విద్యనభ్యసించే హక్కు, భర్తను ఎంపిక చేసుకునే స్వతంత్రం, విడాకుల తర్వాత, లేదా భర్త మరణించిన తర్వాత పునర్వివాహం, ఆస్తి హక్కు, ఆస్తిని అమ్మే హక్కు, సంపాదించే హక్కు లాంటి చాలా హక్కులను ఈ చట్టం మహిళలకు ఇచ్చిందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+