GOOGLE : గూగుల్ లో భారీగా కంటెంట్ తొలగింపు- కొత్త ఐటీ చట్టం అమల్లోకి రాకముందే
దేశంలో సోషల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 26న కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. దీంతో ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు కూడా ఈ నిబంధనల పరిధిలోకి వచ్చేశాయి. వీటిలో ఉంచే కంటెంట్ మూలాలపై కేంద్రం లేదా దర్యాప్తు సంస్ధలు అడిగినప్పుడు వివరాలు ఇవ్వడం, అభ్యంతర కరమైన కంటెంట్ ను తొలగించాల్సి వస్తోంది.
దేశవ్యాప్తంగా కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి రాకముందే సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఏప్రిల్ లోనే తమ ప్లాట్ ఫామ్స్ నుంచి అభ్యంతరకరమైన కంటెంట్ ను భారీగా తొలగించింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే దాదాపు 60 వేల కంటెంట్ పీసుల్ని గూగుల్ తొలగించింది. మే 26 నుంచి కొత్త ఐటీ రూల్స్ అమల్లోకి రానుండగా.. ఏప్రిల్ లోనే గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా గూగుల్ విడుదల చేసిన నెలవారీ పారదర్శకత నివేదికలో ఈ విషయం బయటపడింది.

భారత్ లో గూగుల్ కంటెంట్ పై వ్యక్తుల నుంచి వచ్చిన 27700 ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లున్న సోషల్ మీడియా సంస్ధలు తమ ప్లాట్ ఫామ్ లపై ఉంచే కంటెంట్ కు సంబంధించి అందే ఫిర్యాదులపై ఏ చర్యలు తీసుకున్నారో కేంద్రానికి వెల్లడించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా గూగుల్ కేంద్రానికి ఇచ్చిన పారదర్శకత నివేదికలో గూగుల్ కంటెంట్ తొలగింపు బయటికొచ్చింది. మరోవైపు ఈ తొలగింపుపై స్పందించిన గూగుల్ ఇదేమీ కొత్త కాదని, 2010 నుంచే తాము పారదర్సకత నివేదికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications