వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్ దట్ బ్రీత్స్: ఆకాశం నుంచి కిందపడే పక్షులను చేరదీసి, చికిత్స అందిస్తున్న సోదరులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బేస్మెంట్ గ్యారేజీలోనే పక్షులకు చికిత్స

దిల్లీలోని ఒక చిన్న గ్రామం వజీరాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత 20 ఏళ్లుగా దెబ్బ తగిలి నేలకొరిగిన పక్షులను సంరక్షిస్తున్నారు.

మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ ఎన్నో ఏళ్లుగా ఈ పనిని నిబద్ధతతో చేస్తున్నారు. వీరు కాపాడిన పక్షుల్లో గాలిపటం మాంజాకు అద్దిన గాజుపొడి వలన గాయపడినవే ఎక్కువ.

తమ ఇంటి బేస్‌మెంట్‌లో ఉన్న కారు గ్యారేజీలోనే పక్షుల కోసం కొంత స్థలాన్ని కేటాయించారు ఈ అన్నదమ్ములు. దెబ్బ తగిలి ఆకాశం నుంచి కింద పడిన పిట్టలను అట్టపెట్టెలో పెట్టి, ఇంటికి తీసుకొచ్చి చికిత్స చేస్తారు.

వాటి గాయాలు కడిగి, దెబ్బలకు మందు పూసి, విరిగిన ఎముకలు, రెక్కలను సరిచేస్తారు.

వీరు చేస్తున్న పనిపై 'ఆల్ దట్ బ్రీత్స్' అనే డాక్యుమెంటరీ తీశారు షౌనక్ సేన్. దానికి అవార్డు కూడా వచ్చింది.

"మన దేశమనో, మన మతమనో జాలి చూపించడం కాదు. జీవితమంటేనే ఒక సంబంధం. అందుకే, పక్షులను అలా విడిచిపెట్టలేం" అంటూ ఆ అన్నదమ్ములు చెప్పుకొచ్చారు.

పక్షులకు చికిత్స అందిస్తున్న అన్నదమ్ములు

ఆ బేస్‌మెంట్‌లో చమత్కారాలు జరుగుతాయి

2022 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ సినిమా డాక్యుమెంటరీ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది 'ఆల్ దట్ బ్రీత్స్' డాక్యుమెంటరీ.

90 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ బోధనలు చేసేదో, ఆశ్చర్యానికి గురిచేసేదో కాదు.

మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ చేస్తున్న పనికి ప్రశంస ఇది. వాతావరణ మార్పులపై ఆలోచన రేకెత్తించేది. దిల్లీ వెలుగుజిలుగులు దాటి జీవితాలను చూపించే చిత్రం.

"ఈ డాక్యుమెంటరీ ఒక అద్భుతం. ఇది చిన్నదే కానీ చాలా పెద్దది" అని ఒక హాలీవుడ్ రిపోర్టర్ ప్రశంసించారు.

వాళ్ల బేస్‌మెంట్‌లోనే ఈ డాక్యుమెంటరీని చిత్రాకరించారు. ఒక టేబుల్‌పై దెబ్బ తగిలిన పక్షులను ఉంచి చికిత్స చేస్తారు. మెటల్-కటింగ్ మెషీన్‌లు, లిక్విడ్-సబ్బు డిస్పెన్సర్‌లతో అదొక చిన్న ఫ్యామిలీ బిజినెస్‌లా ఉంటుంది. వాళ్ల కారు ఓ మూల పార్క్ చేసి ఉంటుంది.

ఆ బేస్‌మెంట్‌లో చమత్కారాలు జరుగుతాయి. అక్కడ కొన్ని జీవితాలు తిరిగి ప్రాణం పోసుకుంటాయి. కొంత వెంటకారం కూడా వినిపిస్తుంది.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య అణుయుద్ధం వస్తే ఈ పక్షులన్నీ ఏమైపోతాయో అంటూ ఆ అన్నదమ్ములకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి యువకుడు పరిహాసమాడతాడు.

"ఆ వార్త ఎక్కడ విన్నావు?" అని వాళ్లు అడిగితే, "సోషల్ మీడియాలో చదివాను" అంటాడా కుర్రాడు.

ఈ డాక్యుమెంటరీని 2020 ప్రారంభంలో చిత్రీకరించారు. వివాదాస్పద పౌరసత్వ చట్టంపై హిందువులు, ముస్లింల మధ్య నగరంలో చెలరేగుతున్న అల్లర్లు, కాలుష్యం, మురుగుతో నిండిన యమునా నది, ఆకాశంలో ఎగురుతూ పొగమంచులో కళ్లు పొడుచుకుని మరీ ఆహారం కోసం వెతికే పక్షులు కనిపిస్తాయి.

పక్షులు ఎక్కువగా గాలిపటం మాంజాకు అద్దిన గాజుపొడి తగిలి గాయపడుతుంటాయి

పక్షులే ప్రపంచం

వారు తొలిసారిగా రక్షించిన పక్షికి చికిత్స అందించేందుకు పొరుగున ఉన్న పక్షుల ఆస్పత్రి నిరాకరించింది. కారణం, అది "మాంసాహార పక్షి" కావడమే.

ఆ సమయంలో వాళ్లిద్దరూ టీనేజీలో ఉన్నారు. బాడీ బిల్డింగ్‌పై శ్రద్ధ పెట్టేవారు. శరీరంలో ఉండే నరాలు, కండరాలు, మాంసం గురించి అప్పుడే వారికి బాగా తెలిసింది.

పిట్టలకు ఎలా కట్టు కట్టాలో నేర్చుకున్నారు. మెల్ల మెల్లగా పక్షులే వాళ్ల ప్రపంచం అయిపోయింది.

"నేలపై పడుకుని ఆకాశంలోకి చూస్తూ పక్షుల వరుసను గమనిస్తూ ఉండేవాళ్లం. ఒక్కోసారి అవి చేసే విన్యాసాలు చూస్తే తల తిరుగుతున్నట్టు అనిపించేది" అని వాళ్లు చెప్పారు.

"ఆకాశంతో, పక్షులతో ఈ అన్నదమ్ములకు గాఢమైన అనుబంధం ఉంది" అని దర్శకుడు సేన్ అన్నారు. ఈ డాక్యుమెంటరీ తీయడానికి మూడేళ్లు పట్టిందని చెప్పారు.

పాన్ షాట్లు ఉపయోగించి దిల్లీ వాతావరణాన్ని వివరంగా చూపించారు సేన్. కాలుష్యం, పొగ, కొండల్లా పెరిగిపోయిన చెత్తకుప్పలతో దిల్లీ "కట్టు కట్టని గాయం"లా ఉంటుందంటారు ఆ అన్నదమ్ములు.

వర్షాకాలంలో వాళ్ల వీధిలో గుంటలు నిండిపోయి బేస్‌మెంట్‌లోకి మురికి నీరు చేరుతూ ఉంటుంది. పందులు బురదలో పొర్లుతుంటాయి. చలికాలంలో గాలి కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంటుంది.

"నా గొంతు బొగ్గులా మారినట్టు అనిపిస్తుంది" అని షెహజాద్ చెప్పారు.

కానీ, ఈ కాంక్రీటు అరణ్యంలో కూడా జీవితం ఉంది. కోతులు వైర్ల మీద ఉయాలలూగుతుంటాయి. ఆకాశంలో ఎగురుతున్న విమానం కిందనున్న నీటిగుంటలో ప్రతిబింబిస్తుంది. అన్నదమ్ములిద్దరూ బేస్‌మెంట్‌లో క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు.

తాము ఆరంభించబోయే లాభాపేక్ష లేని సంస్థకు విదేశీ నిధులు పొందవచ్చని ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఆ ఆనందంలో వాళ్లిద్దరూ వర్షంలో ఐస్‌క్రీం తింటారు.

వాతావరణం తేలికపడగానే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల డాబాలపైకి జనాలు చేరతారు. మళ్లీ గాలిపటాలు ఎగరేస్తారు. మాంజా తగులుకుని పక్షులు కింద పడతాయి. ఈ అన్నదమ్ములకు మళ్లీ పని మొదలు.

ఒక సమయంలో 100 కంటే ఎక్కువ పక్షులు బేస్‌మెంట్‌కు చేరాయి. ఒక్కోసారి పొగమంచులో కళ్లు తెలియక పెద్ద పెద్ద భవనాలను గుద్దుకుని పడిపోతుంటాయి. ఓవర్ హెడ్ వైర్లలో చిక్కుంటాయి.

ఒకసారి నదికి ఆవల రెక్క తెగి పడి ఉన్న ఓ పక్షిని కాపాడడానికి అన్నదలిద్దరూ ఈదుకుంటూ వెళ్లారు.

వీటన్నింటినీ డాక్యుమెంటరీలో చిత్రీకరించారు. వాళ్ల ప్రపంచాన్ని తెరకెక్కించిన ఘనత షౌనక్ సేన్‌దేనని ఆ అన్నదమ్ములు అంటారు.

"ఈ చిన్న బేస్‌మెంట్‌లో సమయం ఎలా గడిచిపోతుందో తెలీదు. ఏదో ఒకరోజు నాకు హార్ట్ అటాక్ వచ్చి ఈ తడి నేలమీదే పడిపోతా. నా ఛాతీ తెరుచుకుంటుంది. అందులోంచి పక్షులు బయటికొస్తాయి" అని వారిలో ఒకరు అనడం డాక్యుమెంటరీలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
All That Breath: Brothers treating birds falling from the sky
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X