Sisodia Arrest: సిసోడియా అంటే సీబీఐకి గౌరవం-కానీ తీవ్ర ఒత్తిడితోనే- కేజ్రివాల్ వ్యాఖ్యలు
మద్యం కుంభకోణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ నిన్న రాత్రి అరెస్టుచేసింది.సుదీర్ఘ విచారణ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు అరెస్టుచూపించారు. ఇవాళ సాయంత్రం ఆయన్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు. సిసోడియా అరెస్టు ఢిల్లీలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఆందోళనలకు దిగింది.
ఈ నేపథ్యంలో సిసోడియా అరెస్టుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విమర్శలకు దిగారు. అంతే కాదు ఓ కీలక విషయం కూడా వెల్లడించారు. సిసోడియా అంటే సీబీఐ అధికారులకు ఎంతో గౌరవమని, కానీ పైనుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో వారు ఆయన్ను అరెస్టు చేసినట్లు కేజ్రివాల్ వెల్లడించారు. సీబీఐలో మెజారిటీ అధికారులు సిసోడియా అరెస్టుకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వారందరికీ సిసోడియా అంటే ఎంతో గౌరవమని, అలాగే ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదన్నారు.

మరోవైపు సిసోడియా అరెస్టుపై స్పందించిన బీజేపీ.. కేజ్రివాల్ ఈ స్కామ్ కు కింగ్ పిన్ అని, ఈ కేసులో తర్వాత అరెస్టు చేసేది కేజ్రివాల్ నే అని వెల్లడించింది. గతేడాది ఎక్సైజ్ పాలసీ స్కాంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో ఆరోపణలు చేయించడం మొదలుపెట్టిన బీజేపీ.. ఆ తర్వాత నేరుగా రంగంలో దిగింది. చివరికి ఈ కేసులో కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీబీఐ అధికారులు సిసోడియా స్ధాయి నేతను అరెస్టు చేయడంతో ఇప్పుడు కేజ్రివాల్ పైనే అందరి దృష్టీ నెలకొంటోంది.












Click it and Unblock the Notifications