తిరంగాతో ఇబ్బంది ఉంటే పాకిస్తాన్ వెళ్లిపోండి : కేజ్రీవాల్ ఫైర్!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన 'తిరంగా మార్చ్'కు ముందు పోలీసులు తీసుకున్న చర్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఇది పక్కా నిరంకుశత్వమని అభివర్ణించిన కేజ్రీవాల్.. సొంత దేశంలో జాతీయ జెండాను ఎగురవేయడం నేరమా? అని ప్రశ్నించారు. "మనం మన దేశంలో తిరంగాను ఎగరవేయకపోతే పాకిస్తాన్లో ఎగరేస్తామా? భారత జాతీయ జెండాతో ఇబ్బంది ఉన్నవారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు" అని సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు.
కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్లో తిరంగా మార్చ్ పేరుతో నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న నేహా బోరాను కూడా మండి హౌస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ నాయకులను అరెస్ట్ చేయడంపై పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్తను సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. "ఇది పక్కా నిరంకుశత్వం. జాతీయ జెండా కూడా నేరమేనా? అభిజీత్ అరెస్ట్ అనేది మోదీకి వారి పట్ల ఉన్న భయాన్ని స్పష్టంగా చూపిస్తోంది" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ వెంటనే మరో పోస్టులో ఇండియాలో తిరంగాను గౌరవించడాన్ని అడ్డుకునే వారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదని, అలాంటి వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలని మండిపడ్డారు.
అయితే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకోకముందే దాదాపు 20 మందికి పైగా డిల్లీ పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని ముందస్తు నోటీసులు జారీ చేశారు. సాధారణ పౌరులు, వ్యాపారులు, ప్రయాణీకులు, రోగుల రాకపోకలకు ఆటంకం కలిగించే ఎలాంటి నిరసనలు చేపట్టకూడదని ఆ నోటీసులో స్పష్టం చేశారు. అనుమతి లేని నిరసనలు, శాంతిభద్రతల సమస్యలను సాకుగా చూపుతూ పోలీసులు ఈ చర్యలు తీసుకోగా..కేజ్రీవాల్ సహా ఇతర ప్రతిపక్ష నాయకులు పోలీసుల చర్యలను ప్రజాస్వామ్య విరుద్ధమని ఖండిస్తున్నారు. దీంతో ఢిల్లీలో తిరంగా మార్చ్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
हम अपने देश में तिरंगा नहीं लहरायेंगे तो क्या पाकिस्तान में लहरायेंगे?जिन्हें भारतीय तिरंगे से परेशानी है, वो पाकिस्तान चले जायें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 16, 2026













Click it and Unblock the Notifications
