ఢిల్లీ సీఎంగా ఆతిషి: షీలా దీక్షిత్ తరువాత తొలిసారిగా: కొత్త మంత్రివర్గం
Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, మంత్రి ఆతిషి మెర్లీనా సింగ్ ఎన్నికయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆప్ శాసన సభా పక్షం ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమెను ప్రతిపాదించారు. కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ బలపరిచారు.
11 సంవత్సరాల తరువాత ఢిల్లీకి మరోసారి మహిళ ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఢిల్లీకి షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె తరువాత మళ్లీ మహిళకు పట్టం కట్టడం ఇదే తొలిసారి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి షీలా దీక్షిత్ సారథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. 2013 నాటి ఎన్నికల్లో ఆమె ప్రభుత్వం ఓడిపోయింది.

ప్రస్తుత కేబినెట్‌లో ఆతిషి.. అయిదు మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్నారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, పర్యాటకం, ఆర్ట్స్, కల్చర్, లాంగ్వేజ్, పబ్లిక్ వర్క్స్, విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్నారు. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు చురుగ్గా వ్యవహరించారు ఆతిషి. బీజేపీ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు. ఉన్నత విద్యావంతురాలు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక కార్యకర్తగా వ్యవహరించారు. వివాద రహిత నాయకురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది.
కేజ్రీవాల్ నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగిన ఈ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో మంత్రులు ఆతిషితో పాటు కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఆతిషిని తమ లెజిస్లేటివ్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నట్లు రూపొందించిన పత్రంపై వాళ్లందరూ సంతకం చేశారు. దీన్ని లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అందజేయనున్నారు. ఈ సాయంత్రం 4:30 గంటలకు వాళ్లందరూ కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని ఎల్జీకి అందజేస్తారు.
ఆదే సమయంలో ఢిల్లీ మంత్రివర్గ విస్తరణ సైతం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ పరిధిలో ఉన్న శాఖలను ఆతిషి స్వీకరిస్తారు. ఆమె ఆధీనంలో ఉన్న శాఖలను పర్యవేక్షించడానికి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. కొండ్లి శాసన సభ్యుడు కుల్‌దీప్ కుమార్‌ను కేబినెట్ బెర్త్ ఖరారావుతుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications