• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాదీశాట్: 750 మంది విద్యార్థినులు తయారు చేసిన శాటిలైట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
శాటిలైట్ తయారీ

ఇస్రో కొత్తగా రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక (ఎస్‌ఎస్‌ఎల్‌‌వీ)ను ఆదివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. ఈ నౌక ద్వారా ఆజాదీశాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ ఉపగ్రహాలను రూపొందించారు. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ప్రభుత్వం అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ఈ శాటిలైట్ తయారీలో దేశంలోని 75 వేర్వేరు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినులు పాలుపంచుకున్నారు.

ఈ శాటిలైట్‌ను 'స్పేస్ కిడ్స్ ఇండియా' అనే సంస్థ తయారు చేసింది. దీనిని ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌‌వీ) ద్వారా నింగిలోకి పంపారు.

ఎస్‌ఎస్‌ఎల్‌‌వీ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇది మొదటిది.

దీనిని శ్రీహరికోటలోని సతీష్ థవన్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రాజెక్టులో భాగమైన విద్యార్థినుల్లో 400 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

8 కేజీల బరువున్న శాటిలైట్ సోలార్ ప్యానెళ్లకు ఫోటోలు తీసేందుకు సెల్ఫీ కెమెరా కూడా అమర్చారు. దూర ప్రాంతాలకు సందేశాలు పంపేందుకు తగిన కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ కూడా ఉంది.

విద్యార్థినులు

కలల విహారం

"ఈ శాటిలైట్ తయారీలో 750 మంది అమ్మాయిల ఆత్మ ఉంది. ఇది వారందరి కల. దేశంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు ఇందులో పాల్గొన్నారు. సైన్సుకు సంబంధించిన అవగాహనను మరింత ప్రచారం చేయాలి" అని శాటిలైట్ ఇండియా సీఈఓ శ్రీమతి కెస్సన్ చెప్పారు.

"ఈ ప్రాజెక్టులో 750 మంది విద్యార్థినులు పాల్గొన్నప్పటికి, మేము సైన్సును కొన్ని లక్షల మంది విద్యార్థుల దగ్గరకు తీసుకుని వెళ్లగలిగాం. జిల్లాలు, పట్టణాల్లో ఉండే పాఠశాలలను అనుసంధానం చేయగలిగాం" అని శ్రీమతి చెప్పారు.

ఈ ఉపగ్రహాన్ని రూపొందించేందుకు సుమారు 6 నెలలు పట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహించినట్లు తెలిపారు.

"స్వేచ్ఛ అంటే ఎగరడమే. కానీ, ఈ ప్రాజెక్టులో సైన్సును వెనుకబడిన ప్రాంతాల్లో స్కూళ్లకు తీసుకుని వెళ్లడమే ముఖ్యమైన విషయం. అమ్మాయిలను శాస్త్రవేత్తలుగా చేయడం, వారిలో ఆలోచనా శక్తిని పెంచడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం".

ఈ శాటిలైట్ లాంచ్‌లో పాల్గొనేందుకు ప్రాజెక్టులో పాల్గొన్న 462 మంది విద్యార్థినులను శ్రీహరికోట తీసుకుని వెళ్లారు.

"ఇస్రోకి వచ్చి శాటిలైట్ లాంచ్ చూడటం ఈ అమ్మాయిలకు చాలా గొప్ప విషయం. మేము ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వారందరినీ తీసుకుని రావాలని అనుకున్నాం కానీ, లాజిస్టిక్ కారణాల రీత్యా సాధ్యపడలేదు" అని చెప్పారు.

అమ్మాయిలే ఎందుకు?

"నేను ఎన్‌ఎస్‌ఎస్‌లో పని చేసాను. అందులో నేను ఉత్తమ క్యాడెట్‌గా ఎంపికయ్యాను. సైన్యంలో పని చేసేందుకు కూడా ఎంపిక అయ్యాను. కానీ, నాకు 18 ఏళ్లకే పెళ్లి అయింది. అమ్మాయిలకు అవగాహన కల్పించి పెద్ద పెద్ద కలలను కనేలా చేయడమే నా కల".

"అంతరిక్షంలో మీ కల సాకారం అయితే అంత కంటే గొప్ప విషయమేముంటుంది? అందుకే మేము ఈ ప్రాజెక్ట్ కోసం అమ్మాయిలను మాత్రమే తీసుకున్నాం. వాళ్ళు కూడా పెద్ద పెద్ద కలలను కనేలా చేయాలనుకున్నాం" అని శ్రీమతి చెప్పారు .

"మేము విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్నప్పుడు వాళ్లకు సైన్సు మాత్రమే కాకుండా, ఎక్కడికైనా చేరేందుకు, దేనినైనా అందుకునేందుకు కావల్సిన ఆత్మా విశ్వాసాన్ని కూడా అందించాం" అని అన్నారు.

"మాతో పని చేసిన కొంత మంది అమ్మాయిలు ప్రస్తుతం శాస్త్రవేత్తలు కావాలని కలలు కంటున్నారు".

"మేము విద్యార్థినుల మనసులో సైన్సు, ఆత్మవిశ్వాసం అనే బీజాలను నాటాం. వీరిని అభివృద్ధితో అనుసంధానం చేసేందుకు ఒక వారధి తయారవుతుందని భావిస్తున్నాం. అమ్మాయిల అభివృద్ధి లేనిదే దేశ పురోగతిని ఊహించలేం" అని అన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 74 శాతం అక్షరాస్యత ఉంది. కానీ, సామాజికంగా, ఆర్ధికంగా దేశ జనాభాలో సగం మంది భారీ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.

ప్రతీ 100 మంది అబ్బాయిలకు 81 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నత విద్యాభ్యాసం కోసం నమోదు అవుతున్నట్లు 2013లో విడుదల చేసిన భారత ప్రభుత్వ నివేదిక చెబుతోంది.

శాస్త్రీయ దృక్పథం

అమ్మాయిల ఆలోచనా ధోరణని విస్తృతం చేసి సైన్సు రంగంలో వారికున్న అవకాశాల గురించి తెలియచేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశ్యం అని శ్రీమతి చెప్పారు.

"చాలా మంది అమ్మాయిలు వాళ్ళు శాస్త్రవేత్తలు కాగలరని కూడా ఊహించలేదు. చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఎన్నుకున్నారు. శాస్త్రవేత్త అవ్వాలనే ఆలోచన వారికస్సలు లేదు. ప్రస్తుతం మేమా ఆలోచనను వారి మనసులో నాటాం.వాళ్లిప్పుడు శాస్త్రవేత్తలు కావాలని కలలు కంటున్నారు" అని అన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 75 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యారు.

అమృత్‌సర్‌లో మాల్ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాల లోని విద్యార్థినుల బృందం కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు.

ఈ ప్రాజెక్టులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఒక విద్యార్థిని బీబీసీ ప్రతినిధితో అన్నారు.

ఈ స్కూలు విద్యార్థులు శాటిలైట్‌కు అవసరమైన ఒక చిప్ తయారు చేసారు. అందులో చాలా సెన్సార్లు ఉన్నాయి.

"మాకు ఇది తయారు చేయడానికి 6 నెలలు పట్టింది. మేము శాటిలైట్ లో అమర్చిన ఒక చిప్ తయారు చేశాం. కొత్త ప్రదేశానికి వెళ్లడం, ఎలా నేర్చుకోవాలనే లాంటి చాలా ఆలోచనలు మా మనసులో ఉండేవి. కానీ, మాకు నేర్చుకునేందుకు చాలా ఆసక్తి ఉండేది"అని ఎలీజా అనే విద్యార్థిని చెప్పారు.

చాలా మంది విద్యార్థులకు ఊరు దాటి బయటకు వెళ్లడం మొదటిసారి.

"నేను మొదటిసారి విమానం ఎక్కుతున్నాను. నేను విమానంలో ప్రయాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, కలలు కూడా నిజమవుతాయి" అని మరొక విద్యార్థిని అన్నారు.

"ఈ ప్రాజెక్టు నాకు కలలు కనడాన్ని నేర్పించింది. నేను భవిష్యత్తులో శాస్త్రవేత్తను అవుతాను" అని అన్నారు.

ఈ ప్రాజెక్టుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీమతి కృతజ్ఞతలు తెలిపారు.

"ఇది లాంచ్ చేసేందుకు ఆయన అంగీకరించడమే ఆయన ఇచ్చిన అతి పెద్ద సహకారం. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న విద్యార్థులు మోదీని కలిసే అవకాశం ఇవ్వాలి" అని శ్రీమతి కోరారు.

ప్రధాని "ప్రధాని బేఠీ బచావో, బేఠీ పడావో" నినాదాన్ని ఇచ్చారు. మేము అమ్మాయిలను అంతరిక్షంలోకి తీసుకుని వెళుతున్నాం. ఈ అమ్మాయిలందరూ సైన్సు ద్వారా దేశాభివృద్ధిలో భాగం అవుతారని మేము విశ్వసిస్తున్నాం" అని అన్నారు.

శాటిలైట్ తయారీలో పాల్గొన్న విద్యార్థులు

భారతదేశంలో అమ్మాయిలకు చాలా కట్టుబాట్లు ఉంటాయి. సమానత్వం కోసం చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారు.

"అమ్మాయిలకు పూర్తి స్వేచ్ఛ లభించలేదు. కానీ, అమ్మాయిలు కూడా చాలా రంగాల్లో విజయం సాధించారు. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అమ్మాయిలు తయారు చేసిన శాటిలైట్ లాంచ్ చేయడమే చాలా గొప్ప విషయం" అని శ్రీమతి అన్నారు.

"మురికి దుస్తులు ధరించి నెత్తి మీద కుండ పెట్టుకుని వెళుతున్న అమ్మాయి చిత్రాన్ని ప్రజల మనసుల్లోంచి చెరిపేయాలి. అమ్మాయిల చేతికి శాటిలైట్ ఇస్తున్న లాంటి చిత్రాన్నే ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాం" అని శ్రీమతి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
AzadiSat: A satellite built by 750 female students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X