జైలులో ప్రేమకథా చిత్రమ్: ఐటీ హబ్ గజగజ
బెంగళూరు: రౌడీషీటర్ సోదరి మరో రౌడీషీటర్ ను ప్రేమిస్తే ఫలితం ఎలా ఉంటుందో, వారి అరచకాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదోక ఉదాహరణ. భారతదేశంలో ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరాన్ని ఇద్దరు రౌడీల అండతో ఓ మహిళ పోలీసులకు చుక్కలు చూపించింది.
బెంగళూరు నగరంతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలోని పలు పోలీస్టేషన్ల పరిధిలో పట్టపగలు దోపిడీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడు, రౌడీషీటర్ కోటి రెడ్డి అలియాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పరప్పన అగ్రహారకు పంపించారు.
కోటి రెడ్డి సోదరి సుమ (25). జైలులో ఉన్న సోదరుడు కోటి రెడ్డిని చూడటానికి సుమ అప్పుడప్పుడు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లేది. 2011లో అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న పేరుమోసిన రౌడీషీటర్ క్యాట్ రాజ అలియాస్ రాజ (28)తో సుమకు పరిచయం అయ్యింది.
పిల్లికళ్లతో ఉండే రాజ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఖరీదైన బ్రాండ్ల టీషర్టులు వేసుకునే వాడు. అతని అందానికి సుమ పడిపోయింది. సుమ స్వయంగా చేసిన ప్రపోజల్ ను క్యాట్ రాజ అంగీకరించాడు. మూడు సంవత్సరాల క్రితం క్యాట్ రాజ జైలు నుంచి బయటకు వచ్చాడు.
తరువాత క్యాట్ రాజ, సుమ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో కోటి రెడ్డి దోపిడీ ముఠా సామ్రాజ్యానికి క్యాట్ రాజ వారసుడు అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అనతి కాలంలోనే ఆర్థికంగా వేగంగా ఎదిగిపోయాడు.

కోటి రెడ్డి గ్యాంగ్ తో క్యాట్ రాజ పోలీసులకు చుక్కలు చూపించాడు. అయితే రామనగర్ లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హత్య కేసులో క్యాట్ రాజను పోలీసులు అరెస్టు చేశారు. భర్త అరెస్టు తరువాత సుమ దోపిడీ ముఠా నాయకురాలిగా పగ్గాలు చేపట్టింది.
జైలులో భర్త క్యాట్ రాజ, సోదరుడు కోటి రెడ్డి చెబుతున్న సూచనలు పాటిస్తూ విచ్చలవిడిగా దోపిడీలు చేయించింది. ఇటీవల ఓ వ్యాపారి బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెలుతున్న రూ. 3.20 లక్షలు లూటీ చేసి పరారైనారు.
ఈ కేసు దర్యాప్తు చేసిన బెంగళూరు గ్రామీణ జిల్లా హెబ్బగుడి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేసి కారు, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారని సీనియర్ పోలీసు అధికారి ఎస్.కే. ఉమేష్ చెప్పారు.
అయితే సుమ ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటి వరకు వీరి మీద 40కి పైగా కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications