వైనాట్ 40: బీజేఎల్పీ నేతగా చౌదరి: డిప్యూటీ సీఎంగా ప్రమాణం?
Nitish Kumar: బిహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. ఊహించినట్టే- అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జనతాళ్ (యునైటెడ్) నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది.
జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదించారు. పాట్నా రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి, తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

నితీష్ కుమార్ రాజీనామా అనంతరం అక్కడి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ ఉదయం జేడీయూ శాసనసభా పక్ష సమావేశం కొనసాగుతున్న సమయంలోనే అటు భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు.
పార్టీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు బీజేపీ శాసన సభాపక్ష సభ్యులు. రవిశంకర్ ప్రసాద్ ఆయన పేరును బలపరిచారు. అందరూ దీన్ని బలపరిచారు. దీనితో సామ్రాట్ చౌదరి ఏకగ్రీవంగా బీజేఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.
జేడీయూతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏకవాక్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సామ్రాట్ చౌదరి. దీని మీదా ఏకాభిప్రాయం కుదిరింది. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా దీనికి తమ ఆమోదం తెలిపారు. బల్లలు చరిచి తమ అంగీకారాన్ని తెలియజేశారు. దీనితో బిహార్‌లో జేడీయూ- బీజేపీ- హిందుస్తాన్ ఆవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది.

బీజేఎల్పీ భేటీ ముగిసిన అనంతరం సామ్రాట్ చౌదరి విలేకరులతో మాట్లాడారు. ఎల్పీ నేతగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీపక్ తావ్డే.. తనపై ఎంతో విశ్వాసంత ఎన్నుకున్నారని, వారిని నమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు.
తన రాజకీయ జీవితంలో అత్యుత్తమ పదవి ఇదేనంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయడం, త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 40 స్థానాల్లోనూ ఘన విజయం సాధించాలనేదే తమ ముందున్న లక్ష్యమని, దీన్ని సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications