మోదీ పేరు: చప్పట్లు కొట్టి అభినందించిన చంద్రబాబు, పవన్
BJP Parliamentary Party meeting: దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఇండియా కూటమి వరుస భేటీలను నిర్వహిస్తోన్నాయి. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 272. దీనికి 20 సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది ఎన్డీఏ సంకీర్ణ కూటమి. 292 సీట్లకు పరిమితం అయింది. సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది బీజేపీ. ఆ పార్టీకి దక్కింది 240 స్థానాలే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరం.

ఈ పరిణామాల మధ్య ఎన్డీఏ.. ఢిల్లీలో సమావేశమైంది. బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్యమంత్రులు, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా ప్రధానమంత్రిని ఎన్నుకోనున్నారు. పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లోఈ సమావేశం కొద్దిసేపటి కిందటే మొదలైంది.
ఈ వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసీనులయ్యారు. జేడీఎస్- హెచ్ డీ కుమారస్వామి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- అజిత్ పవార్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, జేడీయూ- నితీష్ కుమార్, శివసేన- ఏక్‌నాథ్ షిండే, లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)- చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ ఆవామీ మోర్చా- జీతన్ రామ్ మాంఝీ వేదికపై కూర్చున్నారు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు. జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, హెచ్ డీ కుమారస్వామి, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఈ పేరును బలపరిచారు. ఆ వెంటనే ఇందులో పాల్గొన్న నాయకులందరూ బల్లలు చరుస్తూ, చప్పట్లు కొడుతూ మోదీకి అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications