కొడుకు డ్రగ్స్ కేస్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు బిగ్ షాక్: వాటికి బ్రేక్
ముంబై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నడి సముద్రంలో ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో డ్రగ్స్‌ను సేవిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారిలో ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు ఉండటం వల్ల అందరి దృష్టీ దీని మీద నిలిచింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు అరెస్ట్ చేసిన వారిలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు.
నో బెయిల్..
తాజాగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ కారు డ్రైవర్‌ను విచారించారు. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు అరెస్టయిన మున్‌మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్ బెయిల్ పిటీషన్లను ముంబై మెజిస్ట్రేట్ తోసిపుచ్చింది. విచారణ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనితో మరి కొంతకాలం వారు కస్టడీలోనే ఉంటారు. హైప్రొఫైల్ డ్రగ్స్ కేసు కావడం వల్ల సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయంటూ ఎన్సీబీ ఆందోళన వ్యక్తం చేయడంతో బెయిల్ దక్కలేదు.
సూపర్ స్టార్ ప్రతిష్ఠకు మసక
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడం, ఇందులో ఆర్యన్ ఖాన్ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం వంటి పరిణామాలు షారుఖ్ ఖాన్ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తున్నాయి. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న ఆయన మూవీల షూటింగ్ స్తంభించిపోయింది. తన కుమారుడికి బెయిల్ ఇప్పించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తాను డ్రగ్స్ వాడినట్టు ఎన్సీబీ అధికారుల విచారణలో ఆర్యన్ ఖాన్ అంగీకరించాడు కూడా. ప్రస్తుతం అతను ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు.
ఆ అడ్వర్టయిజ్‌మెంట్లు నిలిపివేత..
కాగా- ప్రముఖ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్ బైజూస్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన అడ్వర్టయిజ్‌మెంట్ల ప్రసారాలను తాత్కాలికంగా నిలిపి వేసింది. ఈ కేసు తేలేంత వరకూ వాటిని టెలికాస్ట్ చేసే అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. షారుఖ్ ఖాన్.. బైజూస్ ఎడ్యుటెక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా బైజూస్ రూపొందించిన పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు వాటన్నింటినీ తాత్కాలికంగా నిలిపివేసింది.
విమర్శల జడివాన
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై వెల్లువెత్తుతోన్న తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని బైజూస్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. షారుఖ్ ఖాన్ తన కుమారుడినే సరిగ్గా పెంచలేదని, ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా విద్యార్థులకు ఏం నైతిక విలువలను బోధిస్తాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న కుమారుడికి తండ్రిగా షారుఖ్ నైతికంగా దిగజారిపోయాడని ధ్వజమెత్తుతున్నారు. ఆయన నటించిన యాడ్స్‌ను నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బైజూస్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
బైజూస్ పైనే
2007 నుంచి షారుఖ్ ఖాన్ బైజూస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి సంవత్సరం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలను చెల్లింస్తోంది. హ్యుండాయ్, బిగ్ బాస్కెట్, దుబాయ్ టూరిజం వంటి పలు కంపెనీలకు షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నాడు. వాటన్నింటికీ మించి బైజూస్‌పై మాత్రమే పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. దీనికి కారణం- కోట్లాదిమంది విద్యార్థులను ప్రభావితం చేసే అడ్వర్టయిజ్‌మెంట్ కావడమే. ఈ కేసు వ్యవహారం తేలేంత వరకూ అవి టెలికాస్ట్ అయ్యే అవకాశాలు లేవు.












Click it and Unblock the Notifications