టమాటా గ్రాండ్ ఛాలెంజ్.. మీరు రెడీనా!!
టమాట ధరలు తాజాగా సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా టమాట ధరలు ఆకాశానికి పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు టమాటాలు కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. అకస్మాత్తుగా పెరిగిన టమాట ధరల సమస్యని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం టమాటా గ్రాండ్ ఛాలెంజ్ ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత దేశంలోని అనేక రాష్ట్రాలలో టమాట ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో వంద రూపాయలకి టమాటాను విక్రయిస్తున్నారు. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. ధరలను నియంత్రించడానికి, ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్తులో రాకుండా చేయడానికి టమాటా గ్రాండ్ ఛాలెంజ్ ను నిర్వహించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టమాటాలు ఉత్పత్తి, టమాటాల ప్రాసెసింగ్ మరియు నిల్వ మెరుగుపరచటానికి వినూత్నమైన ఆలోచనలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు మాట్లాడుతూ ఈ వారం టమాటా గ్రాండ్ ఛాలెంజ్ ను ప్రారంభిస్తామని వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తున్నామని, తద్వారా ధరల పెరుగుదలను నియంత్రించటానికి కావాల్సిన విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉత్పత్తికి ముందు, ప్రాధమిక ప్రాసెసింగ్, కోత, నిల్వ వంటి వాటి నిర్వహణకు సాంకేతిక సలహాలను అందించాల్సి ఉంటుంది.
వ్యవసాయం చేసే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో టమాటా యొక్క ప్రాథమిక ప్రాసెసింగ్, పోస్ట్ హార్వెస్ట్, నిల్వ పెంచడం కోసం తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిష్కారాలను తీసుకురావడం కోసం ఈ ఛాలెంజ్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. గతేడాది ఉల్లిపాయల విషయంలో ఇదే విధంగా ఉల్లి ధరలను నియంత్రించడానికి పరిష్కార మార్గాలను చూశామని, ఈ సంవత్సరం టమాటాల విషయంలో గ్రాండ్ చాలెంజ్ నిర్వహించి ధరల నియంత్రణకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

టమాటా ధరలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి తీసుకునే అన్ని చర్యలను పరిశీలిస్తామన్నారు. ఏది ఏమైనా టమాట ధరలు ఎక్కువగా ఉన్న తరుణంలో కేంద్రం ధరలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి చేస్తున్న టమాటా గ్రాండ్ ఛాలెంజ్ ఈ దీర్ఘకాలిక ప్లాన్ సక్సెస్ కావాలని అందరూ ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications