Chandrayaan-3 : చంద్రయాన్ లో కీలక ఘట్టం-దిశమార్పుకు ఇస్రో ప్రయత్నం-గతంలో ఇక్కడే వైఫల్యం..
చంద్రుడి నిగూఢ రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ప్రయాణం సజావుగా సాగిపోతోంది. ఇప్పటివరకూ భూమిపై నుంచి బయలుదేరాక ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఇస్రో ఇప్పటికే నిర్ధారించింది. భూమి కక్ష్యను వీడి ఆ తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత కీలకమైన చివరి దశలోకి ప్రవేశించిన ఈ అంతరిక్ష నౌక .. ఆగస్టు 23న విజయవంతంగా చంద్రుడిపైకి సురక్షితంగా దిగేందుకు సిద్ధమవుతోంది.
చంద్రయాన్ -3 ప్రస్తుతం తన వేగాన్ని క్రమంగా నియంత్రించుకుంటోంది. ఈ తగ్గింపు తర్వాత గంటకు 6048 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుందని ఇస్రో అంచనా వేస్తోంది. అలాగే చంద్రయాన్ -3 నౌక పూర్తి నిలువుగా తన ప్రయాణం సాగించబోతోంది. ప్రస్తుతం మారుస్తున్న ప్రయాణ వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ఆగస్టు 23న చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యే నాటికి సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో పనిచేస్తోంది. ఇది చాలా క్లిష్టమైన పని అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.

అలాగే చంద్రయాన్-3 అంతరిక్ష నౌక నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయి నిట్టనిలువుగా ప్రయాణం చేయడం ఆరంభించాక అది కేవలం గంటకు 10.8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్షితిజ సమాంతర దిశలో ప్రయాణిస్తున్న దీన్ని నిట్టనిలువు దిశకు మార్చడం చాలా కష్టమైన పనిగా భావిస్తున్నారు. గతసారి ఇక్కడే సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ దిశ మార్పు చాలా కీలకంగా మారిపోయింది.
చంద్రయాన్-3 చంద్రుడిపై సురక్షితమైన ల్యాండింగ్ లక్ష్యంగా వరుస దశల్లో నిలువుగా దిశ మార్చుకుంటుంది. చంద్రయాన్-2 మిషన్‌లో చంద్రుని ఉపరితలంపై తన ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేయడంలో ఇస్రో గతంలో విఫలమైంది. కాబట్టి ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ దిశ మార్పు ప్రయోగం చేపడుతున్నారు. ఇందుకోసం ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఖచ్చితమైన దూరాన్ని నిర్ధారించడం, అన్ని అల్గారిథమ్‌లు సరిగా పనిచేయడం వంటి సవాళ్లు ఉన్నాయని ఇస్రో చెబుతోంది.












Click it and Unblock the Notifications