కరోనా కల్లోలం- ఆస్పత్రులు, ఆక్సిజన్ కొరత- క్వారంటైన్‌కే మొగ్గు- అక్కడా నరకయాతన
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో రోగులు నరక యాతన చవిచూస్తున్నారు. ఓవైపు ఆస్పత్రులు కిక్కిరిసిపోతుండగా, మరోవైపు బెడ్ల కొరత వేధిస్తోంది. ఇంకోవైపు మందులు, వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లోకి చేరిపోతున్నాయి. ఆక్సిజన్ సిలెండర్లు కూడా బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్దితులు చాలా చోట్ల ఉన్నాయి. దీంతో రోగులు ఇళ్ల వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయినా వారిని కష్టాలు మాత్రం వీడటం లేదు.

రూ.50 వేలకు బ్లాక్‌లో ఆక్సిజన్ సిలెండర్లు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండటం, ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతుండటంతో బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోయింది. ఢిల్లీలో సాధారణ పరిస్ధితుల్లో 6 వేల రూపాయలు ఉండే ఆక్సిజన్ సిలెండర్ ఇప్పుడు బ్లాక్‌లో 50 వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తోందని స్ధానికులు చెప్తున్నారు. ఢిల్లీలో చాలా చోట్ల ఆక్సిజన్ సిలెండర్లు బ్లాక్ మార్కెట్లో సాధారణం కంటే 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఢిల్లీ, నోయిడా, లక్నో, అలహాబాద్‌తో పాటు చాలా చోట్ల ఇదే పరిస్దితి.

ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ లేక..
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నానాటికీ పెరిగిపోతోంది. అదే సమయంలో బెడ్లు దొరకడం గగనమైపోతోంది. దీంతో చాలా మంది రోగుల్ని వారి కుటుంబ సభ్యులు ఇళ్ల వద్దే ఉంచి చికిత్స ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో దొరకని ఆక్సిజన్ బ్లాక్‌లో దొరుకుతుంటడంతో వీరంతా ఎక్కువ రేట్లు పెట్టి మరీ చిన్న ఆక్సిజన్ సిలెండర్లు తెచ్చుకుని ఇళ్ల వద్దే చికిత్స తీసుకోవాల్సిన పరిస్దితి దాపురిస్తోంది. దీంతో మధ్యతరగతి ప్రజలు ఈ రేట్లకు నలిగిపోతున్నారు.

పరీక్షలు గగనం, ఫలితాలు వచ్చినా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. అక్కడ సీటీ స్కాన్, ఎక్స్‌రేలు చేయించినా వాటి ఫలితాలు వచ్చే సరికి రెండు మూడు రోజులు కూడా పడుతున్న పరిస్ధితి చాలా చోట్ల ఉంది. అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల కొరతతో ఈ పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్ధితి. దీంతో వేల కొద్దీ రోగులు ఇళ్లకే పరిమితమై సెల్ఫ్ హోమ్ క్వారంటైన్‌కు సిద్దమైపోతున్నారు. స్దానికంగా ఉన్న డాక్టర్లు, మందుల సాయంతో వీరు ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications