బళ్లారి ఎంపీ శ్రీరాములకు శిష్యుడి సెగ, సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కనపెట్టి, ఏం చేస్తారు, బీజేపీ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని సిద్దం అయిన బళ్లారి బీజేపీ ఎంపీ, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బి. శ్రీరాములుకు సొంత అనుచరుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. శ్రీరాములకు మోళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని బీజేపీ అధిష్టానం ఆదేశించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి, ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరు శత్రువులు
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు మిత్రులుగా ఉంటారో, శత్రువులుగా మారుతారో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం బళ్లారి ఎంపీ శ్రీరాములు పరిస్థితి అలాగే ఉంది. ఇంతకాలం తన వెంట ఉన్న అనచరులు ఇప్పుడు ముఖం చాటు వెయ్యడంతో శ్రీరాములు అయోమయంలో పడిపోయారు.

సొంత పార్టీ ఎమ్మెల్యే
గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చిన శ్రీరాములు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి కర్ణాటకలోని అన్ని శాసన సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో మోళకాల్మూరు నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్. తిప్పేస్వామి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

బీజేపీలో విలీనం
బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన శ్రీరాములు తరువాత పార్టీని బీజేపీలో విలీనం చేశారు. శ్రీరాములుతో పాటు బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఎస్. తిప్పేస్వామి సైతం బీజేపీకి మద్దతు ఇచ్చారు. మోళకాల్మూరు నుంచి బీజేపీ టిక్కెట్ తో పోటీ చెయ్యాలని ఎస్. తిప్పేస్వామి భావించారు.

76,827 ఓట్లు
గత శాసన సభ ఎన్నికల్లో మోళకాల్మూరు నియోజక వర్గం నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసిన ఎస్. తిప్పేస్వామి 76,827 ఓట్లతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎన్ వై. గోపాలక్రిష్ణకు 69,658 ఓట్లు, జేడీఎస్ కు 4,226 ఓట్లు, బీజేపీకి 3,221 ఓట్లు, కేజేపీకి 1,826 ఓట్లు వచ్చాయి.

నాయక్ ఓట్లు కీలకం
మోళకాల్మూరు నియోజక వర్గంలో నాయక్ వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ నియోజక వర్గం నుంచి బళ్లారి మాజీ ఎంపీ, శ్రీరాములు సోదరి జే. శాంతా పోటీ చేస్తారని ఇంతకాలం అందరూ అనుకున్నారు. అయితే చివరికి నిమిషంలో బళ్లారి సిట్టింగ్ ఎంపీ శ్రీరాములకు టిక్కెట్ ఇవ్వడంతో ఇప్పటి వరకూ ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి లోలోపల నిరసన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications