Cyclone Mocha: ఏపీకి పొంచివున్న పెను తుఫాన్
భువనేశ్వర్: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ ఇప్పటికే వర్ష ప్రభావానికి గురైంది. పలు ప్రాంతాలు జలమయమౌతున్నాయి. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోతున్నాయి. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అడపా దడపా కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణల్లో చేతికి అందిన పంట దెబ్బతిన్నది.
వచ్చే 24 గంటల్లో విశాఖపట్నంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, తిరుపతిలో ఈ సాయంత్రం తేలికపాటి జల్లులు పడొచ్చని పేర్కొంది.

అనకాపల్లి, విశాఖపట్నం, గోపాలపట్నం, నర్సీపట్నం, శృంగవరపుకోట, అరకులోయల్లో సాయంత్రానికి చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనుంది. ఈ నెల 6వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ దిశలో తుఫాన్ ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తుఫాన్ ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొని ఉందని తెలిపింది. బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో వచ్చే 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, 6వ తేదీ నాటికి తుఫాన్‌గా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావం ఒడిశా, ఏపీపై తీవ్రంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఒడిశా దక్షిణ ప్రాంతం, ఏపీ ఉత్తర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
— India Meteorological Department (@Indiametdept) May 2, 2023
మే రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందంటూ అటు అమెరికా వాతావరణ కేంద్రం గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ సైతం అంచనా వేశాయి. తుఫాన్ ఏర్పడితే దానికి మోచాగా పేరు పెట్టనున్నారు. గత సంవత్సరం ఇదే మే నెలలో అసాని తుఫాన్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఏపీలో ఈ తుఫాన్ తీరం దాటింది.












Click it and Unblock the Notifications