కూతురి పెళ్లికి రూ. లక్ష సాయం: ఆటో డ్రైవర్ల పంట పండినట్టే..!!
Auto Drivers: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లొ దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది. షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తోన్నారు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటుబ్యాంక్. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.

అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తోన్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు.
అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికీ పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయన ఈ మధ్యాహ్నం తన భార్య సునీత కేజ్రీవాల్‌తో కలిసి ఓ ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లారు. కష్ట సుఖాలను పంచుకున్నారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే అల్పాహారం చేశారు. వారి కుటుంబ ఆదాయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. చాలాసేపు అక్కడే గడిపారు.
అనంతరం ఆటో డ్రైవర్ల కోసం అయిదు గ్యారంటీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల కోసం ఈ అయిదు హామీలను అమలు చేస్తామని అన్నారు. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ పరిధిలోని ప్రతి ఆటో డ్రైవర్‌నూ అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారాయన.
1. ప్రతి ఆటో డ్రైవర్‌కూ 10 లక్షల రూపాయల వరకు జీవిత బీమా, అయిదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమాను అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.
2. కుమార్తె వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం
3. ఆటో డ్రైవర్ల యూనిఫాం కోసం ప్రతి రెండు సంవత్సరాలకోసారి 2,500 రూపాయలు చెల్లింపు
4. కాంపిటీటివ్ పరీక్షల కోసం సన్నద్ధం అయ్యే ఆటో డ్రైవర్ల పిల్లలకు అవసరం అయ్యే కోచింగ్ ఫీజు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
5. పూఛో యాప్ పునరుద్ధరణ.. ఈ అయిదు హామీలను ప్రకటించారు కేజ్రీవాల్.












Click it and Unblock the Notifications