బర్త్ డే సెలబ్రేషన్స్.. అదిరిపోయే స్పాట్ చెప్పిన గవర్నమెంట్
జనరేషన్ మారిపోయిన తరుణంలో బర్త్ డే సెలబ్రేషన్స్ స్టైల్ కూడా మారిపోయింది. చిన్నప్పుడు మన ఇంట్లో సాయంత్రం పూట జరిగిన కేక్ కటింగ్స్ ఇప్పుడు అర్ధరాత్రి నడి రోడ్డుపైకి, బీచ్ లలోకి, పబ్స్ లోకి, రిసార్ట్స్ లోకి మారిపోయాయి. అయితే దేశంలో చాలా వరకు అందమైన నదీ తీరాలున్నాయి. అక్కడికి మాత్రం ఎవరూ వెళ్లరు. భద్రతా కారణాల రీత్యా.. అపరిశుభ్రత వంటి కారణాలతో అటువైపు ఆసక్తి కూడా చూపరు.
ఇలాంటి సమయంలోనే .. ఇకపై బర్త్‌డే వేడుకలను యమునా నదీ తీరంలోనే జరుపుకోవాలని ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి సరికొత్త వేదికను సిద్ధం చేస్తున్నాట్లు ఆయన తెలిపారు. నదీతీరంలో ప్రత్యేకంగా గుడిసెలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నదిపై ప్రజలకు మమకారాన్ని పెంచడంతో పాటు, పండగ లేదా ప్రత్యేక సందర్భాలను అక్కడ జరుపుకుంటూనే ఘాట్లను శుభ్రపరిచే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కుటుంబాలు పాలుపంచుకునేలా ఈ ప్రణాళికను రూపొందించారు. నదిని మనసారా ఇష్టపడితే ఎవరూ దానిని మురికి చేయరని, నవంబర్ 7న తన పుట్టినరోజును తానే స్వయంగా యమునా తీరంలో జరుపుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఉత్సాహంగా 'చలో యమున' స్వచ్ఛతా ఉద్యమం..
యమునా నదిని ప్రక్షాళన చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇటీవల నిర్వహించిన 'చలో యమున' కార్యక్రమంలో ఏకంగా 35 వేలకు పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నదీ తీరంలోని 70 ప్రాంతాల్లో ముమ్మరంగా సాగిన ఈ క్లీనింగ్ డ్రైవ్‌లో దాదాపు 76 వేల కిలోలకు పైగా చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇది కేవలం ఒక్క రోజుతో ముగిసే కార్యక్రమం కాదని, నదికి పూర్వ వైభవం తీసుకువచ్చే వరకు నిరంతరం కొనసాగే సుదీర్ఘ ఉద్యమమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రూ.8,941 కోట్లతో భారీ నీటి పారుదల, మురుగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం
యమునా నదిలో కాలుష్యాన్ని పూర్తిగా నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మరో భారీ అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 22న ఏకంగా రూ.8,941 కోట్ల వ్యయంతో.. 43 మురుగునీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. రూ.2,827 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మరో రూ.6,114 కోట్ల విలువైన 33 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
మురుగునీటి ప్రక్షాళనకు అత్యాధునిక ప్లాంట్లు..
యమునా నదిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఔటర్ ఢిల్లీ ప్రాంతంలో 29 వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (STP), పంపింగ్ స్టేషన్లు, వెయ్యి కిలోమీటర్లకు పైగా సరికొత్త సీవర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇప్పటికే ఉన్న 8 ఎస్టీపీలను కూడా ఆధునీకరించనున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ రాబోయే రెండేళ్ల నుంచి రెండేళ్ల ఆరు నెలల కాలంలో పూర్తి కానుండగా, వీటి ద్వారా యమునా నది స్వరూపం పూర్తిగా మారనుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.














Click it and Unblock the Notifications
