మేము రీల్స్ చేయడానికి రాలేదు.. కట్టలు తెంచుకున్న ఆక్రోశం
దేశ రాజధానిలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఓ మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనపై రగులుతున్న విద్యార్థి లోకం, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ మరోసారి ఉద్యమబాట పట్టింది. సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురిసినప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా సుమారు మూడు వేలకు పైగా మంది విద్యార్థినులు నార్త్ క్యాంపస్‌ను హోరెత్తించారు. "మా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు" అంటూ వారు నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు.
ఆస్తా కుంజ్ దారుణమే ఈ ఆగ్రహానికి కారణం
దక్షిణ ఢిల్లీలోని ఆస్తా కుంజ్ పార్కులో పోలీసులమని నమ్మించి మూక దాడికి పాల్పడిన కామాంధులు 17 ఏళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణం జరిగి వారం రోజులు గడుస్తున్నా నిరసనలు ఎక్కడా తగ్గలేదు. గతంలో లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థినులు నిరసన తెలపగా, తాజాగా మిరాండా హౌస్, దౌలత్ రామ్ కాలేజ్ వంటి వివిధ కళాశాలల విద్యార్థినులు, క్వీర్ కమ్యూనిటీ సభ్యులు ఒక్కటయ్యారు. 'హం ఔరతేన్ ఆజాద్ హై' (మేము మహిళలం.. స్వతంత్రులం) అనే బ్యానర్‌తో ఆర్ట్స్ ఫ్యాకల్టీ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన ఉద్ధృతంగా సాగింది.

In solidarity with the women marching at Delhi University. ✊🏽
— Ratna Singh (@whattalawyer) September 28, 2026
Rape culture must end. Women in India deserve so much better than a life shaped by fear. They deserve to live freely, safely, and with dignity.
Enough is enough. It’s time for change.@CJP_2029 @Cockroachisback pic.twitter.com/mjPBpB7OIW
పేరుకుపోయిన సమస్యలు.. పట్టించుకోని యాజమాన్యాలు
క్యాంపస్‌లలో అమ్మాయిల భద్రత కోసం ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) కేవలం నామమాత్రంగానే పనిచేస్తున్నాయని విద్యార్థినులు తీవ్రంగా మండిపడ్డారు. దీపావళి మేళాలు, సాంస్కృతిక ఉత్సవాల సమయంలో వేధింపులు ఎదురైనా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చీకటి పడితే అమ్మాయిలపై ఆంక్షలు విధించడం, బయటకు వెళ్లే సమయాలను ప్రశ్నించడం వంటి నైతిక పోలీసుగిరి ఇకపై చెల్లదని హెచ్చరించారు. బాధితులనే తప్పుపట్టే ధోరణి పోయి, నేరస్థుల ఆలోచన విధానం మారాలని వారు డిమాండ్ చేశారు.
కార్డ్‌బోర్డ్‌లపై నిరసన గళం.. చురుకైన నినాదాలు
ఈ ప్రదర్శనలో విద్యార్థినులు ప్రదర్శించిన ప్లకార్డులు అందరి దృష్టిని ఆకర్షించాయి. 'మేము రీల్స్ చేయడానికి రాలేదు.. మేము కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు', 'బేటీ కి లోకేషన్ కాదు, బేటే కా ఇంటెంట్ చెక్ కరో' (అమ్మాయిల కదలికలు కాదు, అబ్బాయిల ఆలోచన విధానాన్ని పరిశీలించండి) వంటి నినాదాలతో కూడిన పోస్టర్లతో యువత హోరెత్తించారు. తల్లిదండ్రుల నుంచి హెచ్చరికలు ఎదురైనప్పటికీ, భవిష్యత్ తరాల భద్రత కోసమే తాను రోడ్డెక్కినట్లు హన్సరాజ్ కాలేజీ విద్యార్థిని స్పర్షిక ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మహిళలే కాకుండా రక్షక వలయంగా మగ విద్యార్థులు కూడా ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.
వర్షంలో తడుస్తూనే విద్యార్థినులు దౌలత్ రామ్ కాలేజ్ మీదుగా స్వామి వివేకానంద విగ్రహం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. విగ్రహం చుట్టూ ఉన్న వేదికపైకి ఎక్కి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు హోరెత్తించారు. సాయంత్రం వరకు ఇదే జోరు కొనసాగింది. మహిళలకు సురక్షితమైన వాతావరణం ఏర్పడే వరకు, చట్టబద్ధమైన రక్షణ లభించే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థి లోకం స్పష్టం చేసింది. రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ భారీ నిరసన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.














Click it and Unblock the Notifications
