Sunetra Pawar: డిప్యూటీ సీఎం కాక ముందే సునేత్రకు మరో పదవి..!
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మరణం తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పాలై రెండు రోజులు కూడా కాకముందే మహారాష్ట్ర ప్రభుత్వంలో పదవుల రచ్చ మొదలైంది. ఓవైపు ఎన్సీపీకి చెందిన నేతలు అజిత్ శాఖలు తమకు ఇవ్వాలంటూ సీఎం వద్దకు క్యూ కట్టారు. అదే సమయంలో శరద్ పవార్ నేతృత్వంలోని చీలిక వర్గంతో పాటు అజిత్ పవార్ వర్గం కూడా ఎన్సీపీలో ఏకమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇది గ్రహించిన మహాయుతి ప్రభుత్వం వేగంగా పావులు కదిపింది.
దీని ఫలితమే అజిత్ పవార్ భార్య, ప్రస్తుతం ఎన్సీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న సునేత్ర పవార్ (sunetra pawar) కు ఉప ముఖ్యమంత్రి పదవి. ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సునేత్ర పవార్ ను ఎన్సీపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి తమ శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మరో పదవి లభించినట్లయింది. అసలే కప్పల తక్కెడ రాజకీయాలు సాగుతున్న మహారాష్ట్రలో సునేత్రకు ఈ పదవి చాలా కీలకం.

ఎందుకంటే భవిష్యత్తులో ఎన్సీపీలో రెండు వర్గాలు ఏకమై కలిసి పోయిన తర్వాత శాసనసభాపక్షనేతగా ఎవరు ఉండాలన్న చర్చ వచ్చినా సునేత్రా పవార్ తో పోటీ పడాల్సి ఉంటుంది. అలాగే అసెంబ్లీలో ఎన్సీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలకూ ఆమె ఆమోదముద్ర ఉండాల్సిందే. దీంతో వ్యూహాత్మకంగానే సునేత్ర ఈ పదవి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సునేత్ర.. త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలాగే ఆరునెలల్లోపు అసెంబ్లీ లేదా మండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. దీంతో ఆమె కోసం ఎవరు తమ పదవి వదులుకుంటారన్నది కూడా కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications