రోడ్డెక్కిన E- Vitara: హైలైట్స్ ఇవే: ఒక్కసారి ఛార్జింగ్ ఎక్కిస్తే..: స్వదేశీ మంత్రంతో ట్రంప్ కు మోదీ చెక్
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఈ- విటారా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ రోడ్డెక్కింది. మారుతి సుజుకి రూపొందించిన లగ్జూరియస్ కారు ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గుజరాత్ పర్యటన సందర్భంగా ఈ కారును ఆవిష్కరించారు. తొలి వెహికల్ ను జెండా ఊపి ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్ అమలులోకి రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీ 'స్వదేశీ'కి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా సుజుకి మోటార్ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించారు. అలాగే- మారుతి సుజుకికి చెందిన తొలి గ్లోబల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ 'ఇ-విటారా'ను ఆవిష్కరించారు.

హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీ ఉత్పత్తికి మరింత ఊతం ఇచ్చేందుకు, సుజుకి, తోషిబా, డెన్సో కలిసి ఏర్పాటు చేసిన లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్వదేశీ నినాదాన్ని వినిపించారు.
కొత్తగా తయారైన ఇ-విటారా కారును యూరప్, జపాన్ సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. దేశీయ బ్యాటరీ పర్యావరణ వ్యవస్థలో ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తిని కూడా ప్రారంభం కావడం వల్ల ఈ రంగం ఎంతగానో పురోగమిస్తుందని పేర్కొన్నారు.
దేవీ నవరాత్రులు, విజయదశమి, ధంతేరాస్, దీపావళి పండగ సమయంలో 'మేడ్ ఇన్ ఇండియా', స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పండగల సీజన్ లో దేశ ప్రజలు కొనుగోలు చేసే ప్రతి వస్తువులో కూడా మెజారిటీ స్వదేశంలో ఉత్పత్తి చేసినదే అయివుండాలని, అప్పుడే ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాన్ని సార్థకం చేసినట్టవుతుందని మోదీ పేర్కొన్నారు.
ఈ కొత్త ప్లాంట్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలకు అవసరమైన 80 శాతానికి పైగా విడిపరికరాలు తయారవుతాయి. ఇది దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఎగుమతులకు మార్గం సుగమం చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం సుజుకికి భారత్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా మారనుంది.
కాగా- ఇ-విటారాలో ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయి. గ్లోబల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీగా ఇది తయారైంది. దీని పొడవు 4,275 మిల్లీ మీటర్లు. వెడల్పు 1,800, ఎత్తు 1,640, వీల్ బేస్ 2,700 మిల్లీ మీటర్లు. ఇది మోటార్, ఇన్వర్టర్, ట్రాన్స్‌మిషన్‌లను ఏకీకృతం చేసే త్రీ-ఇన్-వన్ ఎలక్ట్రిక్ వ్యవస్థ ఇందులో ఉంటుంది.
కొనుగోలుదారులు డ్యూయల్ బ్యాటరీలను సెలెక్ట్ చేసుకోవచ్చు. 144 హెచ్ పీ, 189 టార్క్ ఉత్పత్తి చేసే ఫ్రంట్-మౌంటెడ్ మోటార్‌తో కూడిన 49 కిలోవాట్ యూనిట్, అలాగే 174 హెచ్ పీ, 189 టార్క్ ఉత్పత్తి చేసే ఫ్రంట్ మోటార్‌తో కూడిన పెద్ద 61 కిలోవాట్ వేరియంట్ తో ఇది లభిస్తుంది.
బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సెటప్ తో అనుసంధానించారు. 65 హెచ్ పీ సామర్థ్యంతో కూడిన రియర్ మోటార్ దీని ప్రత్యేకత. ఈ వేరియంట్ మొత్తం 184 హెచ్ పీ, 300 టార్క్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఒకసారి ఛార్జింగ్ 500 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం డ్రైవ్ చేసే వీలుంది.












Click it and Unblock the Notifications