పావురంపై కేసు .. కాలికి టేప్ తో కాగితం, పాకిస్తాన్ సరిహద్దులో పట్టుకున్న భద్రతా సిబ్బంది
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో అనుమానాస్పదంగా ఒక వైట్ పేపర్ ని తీసుకు వెళుతున్న పావురాన్ని పట్టుకున్న భద్రతా సిబ్బంది ఆ పావురం పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు . పాకిస్తాన్ సరిహద్దు నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ బోర్డర్ పోస్ట్ రోరన్‌వాలా వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఈ పావురాన్ని పట్టుకున్నారు. పాకిస్తాన్లో ఈ పావురానికి శిక్షణ ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

అమృత్ సర్ లోని కహా ఘర్ పోలీస్ స్టేషన్ లో పావురంపై కేసు
పంజాబ్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఒక పావురం పట్టుబడింది. దాని కాళ్ళకు ఒక కాగితపు ముక్క టేప్ తో చుట్టబడింది . అందులో ఒక నంబర్ రాసి ఉంది. ఇది పాకిస్తాన్ దేశంలో శిక్షణపొందిన పావురం గా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించే వ్యవస్థగా గుర్తించిన భద్రతా సిబ్బంది పావురం పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమృత్ సర్ లోని కహా ఘర్ పోలీస్ స్టేషన్ లో పావురంపై కేసు నమోదైంది.

పావురం కాలికి టేప్ తో చుట్టబడిన కాగితం .. దానిపై కోడింగ్ లో ఓ సంఖ్య
పాకిస్తాన్ సరిహద్దు నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న పోస్ట్ వద్ద క్యాంప్ గార్డ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజంపై పావురం వచ్చి వాలింది . ఏప్రిల్ 17 వ తేదీ సాయంత్రం నలుపు మరియు తెలుపు రంగుతో ఉన్న ఈ పావురం భద్రతా సిబ్బందికి పట్టుబడింది. పావురాన్ని పట్టుకున్న కానిస్టేబుల్ వెంటనే పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్ కు సమాచారం అందించారు. దీంతో పావురాన్ని స్కాన్ చేసి పరిశీలించిన వారికి , పావురం కాలికి టేప్ తో చుట్టబడిన ఒక తెల్ల కాగితం , దానిపై ఒక సంఖ్య కనిపించింది.

గూఢచర్యం కోసం పాకిస్తాన్ లో శిక్షణ ఇచ్చినట్లు అనుమానం ,. పావురంపై కేసు నమోదు
దీంతో ఈ పావురాన్ని గూఢచర్యం కోసం పాకిస్తాన్ లో శిక్షణ ఇచ్చినట్లు అనుమానించి పావురం పై కేసు నమోదు చేశారు భద్రతా సిబ్బంది.
గతంలో 2020 మే నెలలో కూడా జమ్మూ కాశ్మీర్ లోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఇదే తరహాలో ఒక పావురం పట్టుబడింది. పావురం పాకిస్తాన్ నుంచి జమ్ము కాశ్మీర్ బోర్డర్ లో కి వెళ్లిన పావురం "కోడెడ్ మెసేజ్" ను కలిగి ఉందని, హిరానగర్ సెక్టార్ లోని మన్యారి గ్రామ వాసులు స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. అదే తరహాలో ప్రస్తుతం పంజాబ్ సరిహద్దులోనూ మరో పావురం కూడా గూఢచర్యం నిర్వహిస్తూ పట్టుబడింది.












Click it and Unblock the Notifications