బెంగళూరులో భారీ వర్షాలు, కుప్పకూలిన ఇండ్లు, అపార్ట్ మెంట్ లో కార్లు !
బెంగళూరు: బెంగళూరులో సోమవారం మద్యాహ్నం నుంచి వివిద ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడింది. బెంగళూరులో మే 12వ తేదీ వరకు పలు చోట్ల విపరీతమైన వానలు అపడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరులో సోమవారం మద్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వానలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
సిలికాన్ సిటీ బెంగళూరులో సోమవారం రాత్రి కురిసిన భారీ వానల కారణంగా వీరభద్రనగర్ లోని మురికివాడల్లో ఉన్న ఐదు ఇండ్లు కుప్పకూలిపోయాయి. మురికివాడలకు అనుకుని ఉన్న అపార్ట్ మెంట్ లో పార్క్ చేసిన కార్లు మీద మురికివాడలోని ఓ ఇంటి కాంపౌండ్ కుప్పకూలడంతో పలు కార్లు దెబ్బ తిన్నాయని అధికారులు తెలిపారు.

అయితే ఐదు ఇండ్లు కూలినా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మే నెల మొదలు అయినప్పటి నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో ఉన్న అధికారులు పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురైనాయని తెలిసింది.
బెంగళూరు సిటీతో పాటు బెంగళూరు గ్రామీణ, తుమకూరు, మైసూరు, చామరాజనగర, రామనగర, చెన్నపట్టణ, కోలారు. చిక్కబళ్లాపుర, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలతో పాటు కరావళి ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

దక్షిణ కర్ణాటకలో కూడా పలు ప్రాంతాల్లో మే 11వ తేదీ వరకు భారీ వానలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వానలు ఎక్కువగా పడుతున్న ప్రాంతాల్లో బుధవారం పోలింగ్ కేంద్రాల్లో ఓటు వెయ్యడానికి వెళ్లి తరువాత ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు మనవి చేశారు.












Click it and Unblock the Notifications