Viral: ఓరి మీ దుంపతెగ.. నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్ ఏంట్రా?
సిలిండర్ ధరలు పెరుగుతున్నాయని సామాన్యులు బాధపడుతుంటే.. కొందరు తెలివైన వ్యాపారులు మాత్రం ఆ భారాన్ని కస్టమర్ల మీద వేయడానికి వింత వింత దారులు వెతుకుతున్నారు. సాఫ్ట్‌వేర్ హబ్ బెంగళూరులో తాజాగా ఒక కేఫ్ ఇచ్చిన బిల్లు చూస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. వంటతో పనిలేని 'చల్లని' నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్' వేసి కస్టమర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బిల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బెంగళూరులోని 'థియో కేఫ్' (Theo's Cafe)కు వెళ్లిన ఒక కస్టమర్ రెండు మింట్ లెమనేడ్‌లు (పుదీనా నిమ్మరసం) ఆర్డర్ చేశారు. ఒక్కో గ్లాసు ధర రూ.179. అయితే బిల్లు చేతికి వచ్చాక అందులో ఒక వింత ఐటమ్ కనిపించింది. అదే "గ్యాస్ క్రైసిస్ ఛార్జ్" (Gas Crisis Charge). నిమ్మరసం చేయడానికి అసలు గ్యాస్‌తో పనేముందిరా బాబూ అని కస్టమర్ నెత్తీనోరూ కొట్టుకున్నంత పని అయింది.

బిల్లు లెక్కలు ఇవే..
ఆ కేఫ్ యాజమాన్యం వేసిన లెక్కలు చూసి మైండ్ బ్లాక్ అయింది సదరు కస్టమర్ కు. రెండు మింట్ లెమనేడ్‌లు రూ.358, 5 శాతం గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ - రూ.17.01, దీనికి తోడు మళ్ళీ 5 శాతం జీఎస్‌టీ (GST). అయితే మళ్ళీ ఒక 5 శాతం డిస్కౌంట్ ఇచ్చి బిల్లును రూ.374 దగ్గర సెటిల్ చేశారు. అంటే డిస్కౌంట్ ఇచ్చినా కూడా, ఆ గ్యాస్ ఛార్జ్ వల్ల కస్టమర్ జేబుకు చిల్లు పడక తప్పలేదు.
"నిమ్మరసం వేడి చేసి ఇచ్చారా ఏంటి?"
ఈ బిల్లు ఫోటో 'ఎక్స్' (ట్విట్టర్)లో ప్రత్యక్షం కావడమే ఆలస్యం.. నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. "ఏంటండీ.. నిమ్మరసం ఏమైనా పొయ్యి మీద పెట్టి వేడి చేసి ఇచ్చారా?" అని ఒకరు సెటైర్ వేస్తే.. "బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువైందని 'ట్రాఫిక్ ఛార్జ్', ఎండ ఎక్కువగా ఉందని 'సన్ రైస్ ఛార్జ్' కూడా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని మరొకరు మండిపడ్డారు. "ఓరి మీ దుంపతెగ.. పచ్చి నిమ్మకాయలు పిండటానికి గ్యాస్ ఎందుకురా?" అంటూ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.
సమర్థించే వారు కూడా ఉన్నారండోయ్!
అయితే కొందరు మాత్రం కేఫ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఎల్‌పీజీ ధరలు పెరగడం వల్ల చిన్న చిన్న కేఫ్‌ల నిర్వహణ కష్టమవుతోందని, అందుకే ఇలాంటి ఛార్జీలు వేయక తప్పడం లేదని వాదిస్తున్నారు. పైగా ఆ కేఫ్ డిస్కౌంట్ కూడా ఇచ్చింది కాబట్టి ఆ రూ. 17 పెద్ద భారం కాదని కొందరి అభిప్రాయం. ఏదేమైనా, చల్లని నిమ్మరసం తాగి సేదతీరదామనుకున్న కస్టమర్‌కు మాత్రం ఈ 'గ్యాస్ ఛార్జ్' వేడి పుట్టించింది.
Gas crisis charge on a lemonade 🤡 pic.twitter.com/d3iylhlQfE
— Phunsuk Wangdu (@Phunsukwangduji) March 15, 2026












Click it and Unblock the Notifications