GetOutRavi : గెట్ అవుట్ రవీ.. తమిళనాడు గవర్నర్ టార్గెట్ గా బ్యానర్లు.. డీఎంకే సర్కార్ తో పోరు..
తమిళనాడులో అధికార డీఎంకే సర్కార్ కు, గవర్నర్ బీఎన్ రవికీ మధ్య వివాదం ఇవాళ మరింత ముదిరింది. ఇప్పటికే ప్రభుత్వం పంపుతున్న పలు కీలక బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్ లో పెడుతున్న గవర్నర్ బీఎన్ రవి మీద పోరు సలుపుతున్న డీఎంకే, మిత్రపక్షాలు.. నిన్న అసెంబ్లీలో తాము పంపిన ప్రసంగాన్ని చదవకుండా కొన్ని లైన్లు వదిలేసిన గవర్నర్ పై భగ్గుమన్నాయి. అసెంబ్లీనే నిరసనకు దిగాయి. దీంతో గవర్నర్ వాకౌట్ చేశారు.
తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ బీఎన్ రవి అసాధారణ రీతిలో వాకౌట్ చేసిన వ్యవహారంపై ఇప్పటికే జాతీయస్ధాయిలో చర్చ జరుగుతోంది. గవర్నర్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి గవర్నర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ డీఎంకే సహా మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో ఇవాళ చెన్నైతో పాటు పలు నగరాల్లో గెట్ అవుట్ రవీ బ్యానర్లు దర్శనమిచ్చాయి. గవర్నర్ తీరును నిరసిస్తూ ఈ బ్యానర్లు పెట్టినట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ లో నంబర్ 1 ట్రెండింగ్ అంటూ గెట్ అవుట్ రవీ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వీటిపై సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ బీఎన్ రవిని గెట్ అవుట్ అంటున్నట్లుగా ఈ ఫ్లెక్సీల్లో ఫొటోలు వేశారు. దీంతో ప్రభుత్వం గవర్నర్ ను రాష్ట్రం నుంచి వెళ్లిపోమనే అర్ధం వచ్చేలా ఇవి కనిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ మాత్రం ప్రభుత్వం తీరును తప్పుబడుతూ గవర్నర్ ను వెనకేసుకొస్తోంది. దీంతో గవర్నర్ కూ, స్టాలిన్ సర్కార్ కూ మధ్య రాబోయే రోజుల్లో మరిన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications