Gujarat Bridge : ఘటనకు షాకింగ్ కారణాలు-గోడ గడియారాల కంపెనీ పనులు-హడావిడిగా ఓపెన్ !
గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ వంతెన కుప్పకూలిన ఘటనలో అన్యాయంగా 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇంత నిర్లక్ష్యంగా ఈ వంతెన నిర్వహిస్తున్నారా అన్న అనుమానాలు కలగకమానవు. అలాగే ఈ వంతెన పునర్నిర్మాణ పనులు అప్పగించిన కంపెనీ సామర్ధ్యంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స కూడా కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఈ ఘటనలో 134 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. అసలే గుజరాత్ లో ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార బీజేపీకి ఈ వ్యవహారం తలబొప్పి కట్టిస్తోంది. దీనికి కారణం ఈ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో బయటపడుతున్న అంశాలే. దీంతో వీటిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అటు ఈ కేబుల్ బ్రిడ్జికి తాజాగా రిపేర్లు నిర్వహించిన కంపెనీ ఒరెవా గ్రూప్ సమర్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కంపెనీకి నిర్మాణ రంగంలో అనుభవమే లేకపోవడమే ఇందుకు కారణం. ఎప్పుడో పురాతన కాలానికి చెందిన ఈ కేబుల్ బ్రిడ్జికి తాజాగా మరమ్మత్తులు చేపట్టేందుకు ఒరెవా గ్రూప్ కాంట్రాక్టు దక్కించుకుంది. మరమ్మత్తుల అనంతరం 7 నెలల తర్వాత ఈ వంతెన అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పనులు చేపట్టిన ఒరెవా గ్రూప్ గుజరాత్ లో సీఎఫ్ఎల్ బల్బులు, గోడగడియారాలు, ఈ బైక్ లు తయారు చేసే కంపెనీ. దీంతో నిర్మాణ రంగంలో అనుభవమే లేని ఈ కంపెనీకి పనులు ఎలా అప్పగించారన్న దానిపై సర్వత్రా విస్మయం చెందుతున్నారు.
అలాగే ఈ కంపెనీ రిపేర్ల తర్వాత పునఃప్రారంభించడానికి అనుకున్న షెడ్యూల్ కంటే ముందే అందుబాటులోకి తెచ్చారు. ఇది కూడా ప్రమాదానికి మరో కారణంగా నిలిచింది. రిపేర్లు చేసిన ఒరెవా గ్రూప్ ఈ వంతెనను 8 నుంచి 12 నెలల పాటు ఏ రిపేర్లు వచ్చినా చేసేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. అలాగే 2037 వరకూ ఈ వంతెన రిపేర్లకు అయిన మొత్తాన్ని టికెట్ల రూపంలో రాబట్టుకునేలా అవకాశమిచ్చారు. దీంతో రూ.12, రూ.17 రూపాయల టికెట్లను విక్రయిస్తోంది. షెడ్యూల్ ప్రకారం దీన్ని ప్రారంభించేందుకు సమయం ఉన్నా గుజరాతీ కొత్త సంవత్సరం కారణంగా అక్టోబర్ 26 నుంచే అనుమతిస్తున్నారు. దీంతో హడావిడిగా చేపట్టిన ఈ ప్రయత్నం కూడా ప్రమాదానికి కారణమైంది.












Click it and Unblock the Notifications