భారత్ కు తలనొప్పిగా రష్యా-ఉక్రెయిన్ పోరు-ప్రభావం పడకుండా మోడీ చాణక్యం.. !
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ కు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు పైకి కనిపిస్తున్నా అంతకు మించి ఎదురవుతున్న సవాలు రష్యా-ఉక్రెయిన్ పోరే. భారత ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన చమురు దిగుమతులకు ఈ యుద్ధ విరమణ తక్షణ అవసరంగా మారింది. దీంతో మన ఆర్ధిక వ్యవస్థపై తీప్ర ప్రభావం చూపుతున్న ఇరు దేశాల యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
భారత్ కు వేల మైళ్ల దూరంలో రష్యా-ఉక్రెయిన్ పోరు జరుగుతున్నప్పటికీ ఇరుదేశాల నుంచి దిగుమతుల విషయంలో భారత ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అయినా చమురు ధరల్ని స్దిరంగా ఉంచేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానమే కీలకంగా మారింది. ముఖ్యంగా ఇరు దేశాలకూ సమదూరం పాటిస్తూ ప్రధాని మోడీ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాల కారణంగా చమురు సప్లై చైన్ దెబ్బతినకుండా ఉన్నట్లు అర్దమవుతోంది. దీంతో మన దేశంలో చమురు రేట్లపై ప్రభావం పడకుండా అడ్డుకోగలిగాం.

వాస్తవానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత రెండేళ్లుగా అంతర్జాతీయంగా పలు దేశాలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. దీంతో ప్రపంచ వాణిజ్యంపై, ముఖ్యంగా చమురు, గ్యాస్, గోధుమలు, ఎరువుల సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో రష్యా ఒకటి. అయితే పాశ్చాత్య దేశాలు దానిపై ఆంక్షలు విధించడంతో, ప్రపంచ చమురు సరఫరా కఠినతరంగా మారింది.
ఈ నేపథ్యంలో రష్యా చమురుపై ఎక్కువగా ఆధారపడిన యూరోపియన్ దేశాలు ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, ధరలను పెంచుతున్నాయి. ముడి చమురులో దాదాపు 80శాతం దిగుమతి చేసుకునే భారతదేశానికి కూడా ఈ అంతరాయం ఆర్ధికంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయినప్పటికీ మన దేశం యుద్ధం వల్ల తలెత్తుతున్న సవాళ్లను నేర్పుగా ఎదుర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినప్పుడు, ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు రాయితీతో రష్యన్ చమురును పొందిన భారత్.. అదనంగా తన దౌత్య మార్గాలతో పశ్చిమ దేశాలతో తన సంబంధాల మధ్య సమతుల్యతను సాధించడానికి, రష్యా నుండి క్లిష్టమైన ఇంధన దిగుమతులను నిర్వహించాల్సిన అవసరాన్ని సమర్థవంతంగా వాడుకుంది. దీంతో భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నప్పుడు, ఇతర దేశాల తరహాలో నియంత్రణ లేకుండా ఉండేందుకు ఈ విధానం కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications