వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ పిల్లల్లోని ‘అసాధారణ ప్రతిభ’ను ఎలా గుర్తించాలి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఈ పిల్లాడి తెలివితేటలు అద్భుతం... ఆ పిల్లకు గొంతు దేవుడిచ్చిన వరం...

ఇలాంటి మాటలను మనం చాలా సార్లు వినే ఉంటాం. తెలిసినవాళ్లో, బంధువులో, స్కూల్‌లో టీచర్లో ఇలా చెబుతుంటారు.

న్యూరోసైంటిస్టులు, న్యూరోసైకాలజిస్టుల ప్రకారం, ఐక్యూ లెవల్స్ సగటు కంటే చాలా ఎక్కువగా ఉండే పిల్లలను ఎక్స్‌ట్రార్డనరీగా భావిస్తారు.

అయితే అసాధారణ ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా ఏదైనా రంగంలో అద్భుతంగా రాణించే పిల్లలను కూడా ఎక్స్‌ట్రార్డనరీగా భావించాలని టీచర్లు, క్రీడా నిపుణులు వాదిస్తున్నారు.

అయితే, ఈ చర్చలకు ఒక ముగింపు అంటూ ఉండదు. కాకపోతే ఐక్యూ లెవల్స్ 97శాతం కంటే ఎక్కువ ఉంటే ఆ పిల్లలను 'గాడ్ గిఫ్టెడ్ చైల్డ్’ అంటారు. బ్రెజిల్‌కు చెందిన ఆరేళ్ల థియో అలాంటి వాడే.

ఆరు నెలలకే మాటలు

ఆరు నెలల వయసులోనే థియో మాట్లాడటం మొదలు పెట్టాడు. 18 నెలలకు ప్రీస్కూల్లో చేరాడు. మూడేళ్ల వయసులో తన ఈడు పిల్లలు అక్షరాలు, అంకెలు నేర్చుకుంటూ ఉంటే థియో మాత్రం చదవడం, రాయడం, లెక్కించడం చేస్తూ ఉండేవాడు.

థియో తెలివితేటలు అద్భుతంగా ఉన్నాయని, పిల్లాడికి ఇంటెలిజెన్స్ టెస్ట్ చేయాలని పాఠశాల నిర్ణయించింది.

తల్లిదండ్రుల అనుమతితో 5ఏళ్ల వయసులో థియోకు టెస్ట్ చేశారు. ఆ పిల్లాడి ఐక్యూ లెవల్స్ 14-15ఏళ్ల వయసు వారితో సమానంగా ఉన్నట్లు తేలింది.

ఆడటం, చదవడం వంటి పనులు చేసే థియో ఇప్పుడు యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించాడు.

'ఒకోసారి వీడియోగేమ్స్ వంటివి ఆడుకోవాలని అనుకుంటాడు. కార్టూన్స్ చూస్తుంటాడు. ఇంకోసారి వాడిలోని టీనేజర్ నిద్రలేస్తాడు. వెంటనే పెద్దపెద్ద విషయాలు మాట్లాడేస్తుంటాడు. మనుషులు ఎలా పుడతారో వాడికి చెప్పాం. వాడిలో పిల్లాడు, టీనేజర్ ఇద్దరూ ఉన్నారు’ అని థియో తండ్రి ఇగోర్ రిబేరియో అన్నారు.

ఎక్కువ ఐక్యూ లెవల్స్ ఉండే వారి గ్రూప్ అయిన మెన్సా ఇంటర్నేషన్‌లో కూడా థియోకు సభ్యత్వం లభించింది. ఆ ఘనత సాధించిన అతి చిన్న బ్రెజిల్ పౌరునిగా థియో నిలిచాడు.

అయితే ఇలాంటి పిల్లలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందడం లేదని, థియోను ప్రైమరీ స్కూల్లో వేయడానికి బ్రెజిల్ నిబంధనలు అనుమతించక పోవడంతో తాను కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని రిబేరియో చెప్పారు.

నికోలీ అనే మరొక పాపది కూడా థియో వంటి కథే. ఈ పాప కూడా పుట్టిన ఆరు నెలలకే మాటలు మొదలు పెట్టింది.

ఉండాల్సిన లక్షణాలు

థియో, నికోలీల మాదిరిగా అసాధారణ ప్రతిభను చూపే పిల్లలు చాలా మందే ఉంటారు. పిల్లల్లో అటువంటి లక్షణాలను న్యూరోసైకాలజిస్టులు, సైకాలజిస్టుల సాయంతో గుర్తించాల్సి ఉంటుంది.

పిల్లల్లో ఉండాల్సిన లక్షణాలు:

  • ఎనలేని ఆసక్తి
  • వయసుకు మించిన మాటలు
  • సులభంగా గ్రహించి వెంటనే నేర్చుకోవడం
  • రీజనింగ్ సామర్థ్యం
  • నాయకత్వ ప్రతిభ
  • ఆత్మవిశ్వాసం
  • మంచి జ్ఞాపకశక్తి
  • సృజనాత్మకత
  • పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం
  • నిశిత దృష్టి

పిల్లల్లో ఉండే ఇటువంటి లక్షణాలను ముందుగా గుర్తించి, ప్రోత్సహించకపోతే వారిలోని ఆసక్తి పోతుంది.

'మంచి తెలివితేటలు ఉన్న చాలా మంది పిల్లలకు స్కూల్లో మంచి మార్కులు రావు. వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడమే ఇందుకు కారణం. క్లాసులో చదువు చెప్పే తీరు కూడా వారి మీద ప్రభావం చూపుతుంది’ అని న్యూరోసైంటిస్ట్ డాక్టర్ ఫాబియానో అన్నారు.

బోర్డు దగ్గర పాప

బ్రెజిల్‌తోపాటు చాలా దేశాల్లో అసాధారణ ప్రతిభ ఉండే పిల్లలను గుర్తించే వ్యవస్థ అంటూ ఏమీ లేదు.

ఇంట్లో వాళ్లు, టీచర్లు, స్నేహితులు వంటి వారు మాత్రమే గుర్తించి పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. అందువల్లే ప్రస్తుతం థియో వంటి 'గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్’ సంఖ్య తక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

బ్రెజిలియన్ కౌన్సిల్ ఆఫ్ గిఫ్టెడ్‌నెస్ ప్రకారం పిల్లలను రెండు రకాలుగా విభజిస్తున్నారు. చదువుల్లో బాగా చురుకుగా ఉండి సైన్స్ అంశాలను తేలికగా అర్థం చేసుకునే వారిని 'బ్రిలియంట్ అకడమిక్స్’ గ్రూపులో ఉంచుతున్నారు.

రెండో గ్రూప్‌ను 'క్రియేటివ్ పీపుల్‌’గా పిలుస్తున్నారు.

'అసాధారణ ప్రతిభలో ఇంటెలిజెన్స్ అనేది ఒక భాగం మాత్రమే. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసే స్థాయి, సామాజిక అవగాహన వంటివి కూడా ముఖ్యమే’ అని సైకాలజిస్ట్ ప్రిసిల్లా అన్నారు.

అసాధారణ ప్రతిభ గల పిల్లల మెదడులోని కొన్ని ప్రాంతాల్లో గ్రే మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. గ్రే మ్యాటర్‌లో నాడీ కణాలు ఎక్కువగా ఉంటాయి.

'ఇలాంటి వారిలో నాడీ కణాలు చాలా పెద్దగా ఉంటాయి. వాటి బలం, సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సమాచారాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం బాగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, రీజనింగ్, గుర్తు పెట్టుకోవడం, ఏకాగ్రత వంటి వాటికి కారణమైన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కూడా ఇందులో భాగమే’ అని డాక్టర్ ఫాబియానో తెలిపారు.

ఇతర పిల్లలతో పోలిస్తే ఇలా అసాధారణ ప్రతిభను చూపే పిల్లల్లోని మెదడులో గల జ్ఞాపకశక్తి వ్యవస్థ చాలా అద్భుతంగా పని చేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే ఇలా అసాధారణ ప్రతిభను కలిగి ఉండటం చూసి అదేదో ఆరోగ్యపరమైన సమస్యగా భావించకూడదని ప్రిసిల్లా అంటున్నారు.

'న్యూరోడెవలప్‌మెంటల్ డిజార్డర్‌గా దాన్ని భావించకూడదు. సృజనాత్మకత, మానసికస్థితి ఆధారంగా అసాధారణ ప్రతిభను చూపుతారని మనం అర్థం చేసుకోవాలి’ అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How to spot 'extraordinary talent' in your child
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X