వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాదన్న యోగి: యూపీ ఎన్నికలు ‘షా’కు సవాలే

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‪గా ఉన్న గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యానాథ్ ను బిజెపి నాయకత్వం పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి.

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‪గా ఉన్న గోరఖ్ పూర్ ఎంపి యోగి ఆదిత్యానాథ్ ను బిజెపి నాయకత్వం పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తిగా యోగి ప్రజలను ప్రత్యేకించి యువతను ఆకర్షించడంలో కీలక నాయకుడు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రత్యేకించి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పెద్ద సవాలే. కానీ కమలనాథులు యోగి ఆదిత్యానాథ్‌కు అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కనీసం పార్టీ ఎన్నికల కమిటీలోనూ చోటు కల్పించడం లేదని వదంతులు వినిపిస్తున్నాయి. కానీ తానేమీ సీఎం పోస్టుకు అప్లయి చేయలేదని కుండబద్దలు కొట్టాడాయన.

14 తర్వాత జాబితా ప్రకటిస్తాం

ఈ నెల 14వ తేదీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని యోగి ఆదిత్యానాథ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి అన్ని విధాల సిద్ధంగా ఉందన్నారు. పార్టీలో అంతర్గత తగాదాలతో సమాజ్ వాదీ పార్టీ తన తప్పులను కప్పి పుచ్చుకోవాలని భావిస్తున్నదని ఆరోపించారు. గత 14 ఏళ్లలో యూపీ చాలా నష్టపోయిందన్నారు. పరిశ్రమలు మూతపడ్డాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని, రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయారని తెలిపారు. నేరాలు కూడా పెరిగిపోయాయని, అవినీతి పెచ్చరిల్లిందని ఆందోళన వ్యక్తంచేశారు.


హిందూ వాహిని పేరిట అతివాద వేదిక ఏర్పాటు

యువతను అతివాదం వైపు మళ్లించేందుకు హిందూ యువ వాహిని పేరిట సంస్థను స్థాపించిన యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ మఠం ప్రధాన మతబోధకుడిగా ఉన్నారు. యువత సామాజిక, సాంస్క్రుతిక కార్యక్రమాల నిర్వహణ కోసమే తాను ఈ హిందూ యువ వాహిని స్థాపించినట్లు చెబుతారు.

రాజకీయ మత మార్పిళ్లకు సారథ్యం

సందర్భోచితంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఆదిత్యనాథ్ తప్పక ఉంటారు. తొలుత 2005లో స్వచ్ఛత కార్యక్రమం కింద క్రైస్తవులను హిందూయిజంలోకి మత మార్పిడికి పూనుకున్నారు. ఏతా పట్టణంలో ఏకంగా 1800 మంది క్రైస్తవులను హిందూమతంలోకి మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

2007లో అరెస్ట్

2007లో మొహర్రం ప్రదర్శన వెళుతుండగా జరిగిన ఘర్షణలో రాజ్ కుమార్ అగ్రహరి అనే యువకుడు మరణించిన ఘటనలో ఆదిత్యానాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొహరం ప్రదర్శన జరిగే స్థలం వద్దకు తన మద్దతుదారులతో వెళ్లి అహింసాయుత ధర్నా పేరిట ఆందోళనకు దిగారు. ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆయన మద్దతుదారులు సమీపంలోని ఒక వర్గం ఆధ్యాత్మిక కేంద్రానికి నిప్పు పెట్టారు.

సూర్య నమస్కారాలు చేయకుంటే దేశం వీడాలన్న యోగి

2015 జూన్ తొమ్మిదో తేదీన యోగాలో భాగమైన సూర్య నమస్కారాలు చేయని వారు, వ్యతిరేకించే వారు భారతదేశాన్ని వీడి వెళ్లాల్సిందేనని హుకుం జారీచేశారు.

హఫీజ్‌తో షారూఖ్‌కు పోలిక

అసహనంపై చర్చలో పాల్గొన్న యోగి ఆదిత్యానాథ్.. పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్‌ను పోల్చేందుకూ వెనుకాడలేదు. ఆయన్ను సూపర్ స్టార్ ని చేసింది దేశంలోని మెజారిటీగా ఉన్న హిందువులేనని గుర్తుచేశారు. లేకపోతే రోడ్ల మీద తిరుగాల్సి వచ్చేదని హెచ్చరించారు.


2002 నుంచి యూపీలో అధికారానికి బిజెపి దూరం

2002 నుంచి అధికారానికి దూరంగా ఉన్న బిజెపి.. 2014లో మోడీ ప్రభంజనంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్ సభా స్థానాలకు 71 స్థానాలను కైవసం చేసుకున్నది. కానీ ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఫలితం సాద్యం కాదని నిర్ధారణకు వచ్చింది. 2014 ఎన్నికల్లో మాదిరిగా 42 శాతం ఓట్లు పొందడం అంత తేలిక కాదని తేల్చుకున్న కమలనాథులు ప్రత్యామ్నాయ మార్గాలపై ద్రుష్టి సారించారు. కేంద్రమంత్రి కుశ్వాహా వంటి వారు రాష్ట్రంలోని చిన్నా చితకాపార్టీలతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 30 శాతానికి పైగా ఓట్లు పొందితే పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం సాదిస్తుందని కమలనాథులు అంటున్నారు.

'I have not applied for CM post in Uttar Pradesh', says BJP's Yogi Adityanath

2012లో ఎస్పీ.. 2007లో బీఎస్పీ గెలుపు

403 స్థానాలు గల యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో సమాజ్ వాదీపార్టీ 30.4 శాతం ఓట్లు పొంది విజయం సాధించింది. అంతకుముందు 2007లో బీఎస్పీ 29.16 శాతం ఓట్లతో గెలుపొందడంతో మాయావతి సొంత బలంపై సీఎంగా పనిచేశారు.

అగ్రవర్ణాలతోపాటు యాదవేతర ఒబిసిలపై కన్ను

తొలి నుంచి మద్దతు పలుకుతున్న బనియా సామాజిక వర్గం, ఇతర అగ్రవర్ణాల వారితోపాటు యాదవేతర ఒబిసిలను తమ అక్కున చేర్చుకునేందుకు యత్నాలు చేస్తున్నారు.దళితుల్లోని కొన్ని వర్గాల వారిని తమతో కలుపుకుపోయేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు.

బిజెపి యూపీ శాఖ అధ్యక్షుడిగా కెపి మౌర్య

కుష్వాహా సామాజిక వర్గ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. ఇక రాజకీయంగా కీలకమైన కుర్మీ సామాజిక వర్గ నేత అనుప్రియ పటేల్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. బీసీ సదస్సుల పేరిట రెండు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకటి చొప్పున 403 నియోజకవర్గాల పరిధిలో 200 ఓబీసీ సభలు నిర్వహించి ఓబీసీల్లో తమ పట్టు పెంచుకునేందుకు ఒక అడుగు ముందుకేసింది. లోద్, కుష్వాహాలు మినహా మిగతా సామాజిక వర్గాలకు నాయకత్వం వహించే వారే లేరు. పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కహర్, కుమ్‌హర్, నిషాద్, రాజ్‌బర్ సామాజిక వర్గాలకు గణనీయ ఓటుబ్యాంక్ ఉంది. వీరంతా 1990 తర్వాత హిందుత్వ మండల్, బహుజన్ నినాదాల మధ్య విడిపోయారు.

బీఎస్పీ సోదర భావ సదస్సులు

ఒబిసిల మద్దతు కూడగట్టేందుకు బీఎస్పీ కూడా తక్కువేం తినలేదు. ఓంప్రకాశ్ రాజ్‌బర్, సంజయ్ రాజ్‌బర్ వంటి నేతలను ముందు వరుసలో నిలిపి సోదర భావ సదస్సులు జరిపింది.

రాజ్‌నాథ్ ఒబిసిలకు ప్రత్యేక కోటా

2001 ప్రారంభంలో నాటి సీఎంగా ఉన్న ప్రస్తుత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వీరి కి ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పించేందుకు యత్నించారు. కానీ న్యాయస్థానం కొట్టివేసింది. ఇది యాదవ్‌లకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని వాదించిన అప్పటి విపక్ష నేత, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం 2005లో పలు ఓబీసీ సామాజిక వర్గాలను ఎస్సీ క్యాటగిరీలో చేర్చాలని ప్రతిపాదించి.. బీఎస్పీ అధినేత మాయావతిని గందరగోళంలో పడేశారు.

బీఎస్పీని డైలమాలోకి నెట్టేసిన యూపీ సర్కార్

తాజాగా దాని కొనసాగింపుగానే 17 ఓబీసీ కులాలను ఎస్సీ క్యాటగిరీలో చేర్చాలని కేంద్రానికి సిఫారసుచేసిందీ యూపీ సర్కార్. తద్వారా ఓబీసీలను తమవైపుకు తిప్పుకోవాలని భావిస్తున్న బీజేపీనీ, దళితుల ఓట్లతో గద్దెనెక్కాలని భావిస్తున్న బీఎస్పీని డైలమాలో పడేసింది. అంతకుముందు 1990వ దశకం నుంచి పాల్, నిషాద్, కహర్, కుమ్‌హర్, రాజ్‌భర్ తదితర ఓబీసీ కులాల వారు తమకు గల రిజర్వేషన్ల సౌలభ్యాన్ని సద్వినియోగంచేసుకోవడంలో విఫలమయ్యారు. రాజకీయంగా ఎదుగుతున్న యాదవ్‌లు, దళితులతో పోలిస్తే ఓబీసీలు పూర్తిగా వెనుకబడ్డారు.

సిఎం అభ్యర్థి లేకుండానే బరిలోకి బిజెపి

స్టార్ రాజకీయ నేతలుగా భావిస్తున్న ప్రస్తుత యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, బిఎస్ పి చీఫ్ మాయావతి వంటి శక్తిమంతులను ఎదుర్కొనే నాయకుడు లేకపోవడంతో బిజెపి సిఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల గోదాలో దిగుతున్నది. ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ కూడా రాష్ట్రమంతా అభిమానులు గల నాయకులు. బిఎస్ పి అధినేత మాయావతి సరేసరి.

English summary
In Uttar Pradesh, activities in the poll-bound state are reaching climax and Bharatiya Janta Party’s (BJP) Yogi Adityanath is a big face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X