అభిశంసన టూ అవిశ్వాసం ? కేంద్రం ఆగ్రహం-వేటు తప్పదనే ధన్ కర్ రాజీనామా !
పార్లమెంట్ సమావేశాలు మొదలైన తొలిరోజే ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ చేసిన ఆకస్మిక రాజీనామా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నిన్న సాయంత్రం వరకూ సభను నడిపిన ఆయన రాత్రికి హఠాత్తుగా ఎవరికీ చెప్పకుండానే రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు. దీంతో ఆశ్చర్యపోవడం అధికార, విపక్షాల వంతయింది. ఇంతకీ తెరవెనుక ఏం జరిగిందని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి.
నిన్న ఉదయం నుంచి చోటు చేసుకున్న పరిణామాలే అంతిమంగా రాత్రికి ఉపరాష్ట్రపతి ధన్ కర్ ఆకస్మిక రాజీనామాకు దారి తీసినట్లు అర్దమవుతోంది. ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వాయిదా పడుతూ వచ్చాయి. మధ్యలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో ఆయనపై అభిశంసనకు విపక్షాలు ధన్ కర్ కు నోటీసు ఇచ్చాయి. దీంతో ఆయన దాన్ని అంగీకరించారు.

ఆ తర్వాత సభ వాయిదా పడ్డాక రాజ్యసభ బీఏసీ భేటీ జరిగింది. అప్పటికే విపక్షాలు జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు ఇచ్చిన నోటీసును ఉపరాష్ట్రపతి ధన్ కర్ ఆమోదించడం బీజేపీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో బీఏసీకి బీజేపీ తరఫున హాజరు కావాల్సిన పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి కిరణ్ రిజిజు, కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అయిన జేపీ నడ్డా రాలేదు. దీంతో ఏదో జరగబోతోందనే అనుమానాలు మొదలయ్యాయి. సభకు హాజరయ్యాక నడ్డా రాజ్యసభ ఛైర్మన్ అయిన ధన్ కర్ పై అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. అయినా ఆయన ఇవేవీ పట్టించుకోకుండా సభను ముందుకు నడిపారు. చివరికి విపక్షాలు ఇచ్చిన నోటీసును ఆమోదిస్తున్నట్లు ప్రకటించి చర్చకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

దీంతో ఆయనకు బీజేపీ పెద్దల నుంచి ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. న్యాయవ్యవస్ధలో అవినీతిపై కేంద్రం పోరాడాలని ఓవైపు భావిస్తుంటే, మరోవైపు ఆ క్రెడిట్ విపక్షానికి ఇచ్చేలా ధన్ కర్ నిర్ణయం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో ఆయనపై అవిశ్వాస తీర్మానం కూడా పెడతామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ధన్ కర్ చేసేది లేక హఠాత్తుగా ఆనారోగ్య కారణాలు చూపుతూ తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు. దీంతో మోడీ సహా బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు ఇప్పుడు నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications