విదేశీయానం ఈజీ: భారత కరోనా సర్టిఫికేట్లకు అమెరికా, బ్రిటన్ సహా 96 దేశాల ఆమోదం
న్యూఢిల్లీ: భారత్ జారీ చేసే కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌కి ఇప్పటివరకు 96 దేశాలు ఆమోదం తెలిపాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు. కొవిన్ యాప్‌లో ఈ దేశాల జాబితా అందుబాటులో ఉందని తెలిపారు. మిగితా దేశాల్లో మన వ్యాక్సిన్ సర్టిఫికెట్ గుర్తింపు కోసం భారత్ ప్రయత్నిస్తోందన్నారు. దీంతో విద్య, వ్యాపారం, పర్యటన కోసం విదేశీ రాకపోకలను సాగించే వారికి ఇక ఇబ్బందులు ఉండవన్నారు.
ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణాలపై అక్టోబర్ 20న కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఆయా దేశాల నుంచి వచ్చే వారికి వెసులుబాటు ఉంటుందని కేంద్రమంత్రి తెలిపారు. ఇక భారత్ నుంచి విదేశాలకు ప్రయాణించే వారు కూడా కోవిన్ పోర్టల్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని మన్సుఖ్ మాండవీయ సూచించారు.

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కు భారత్ తో పరస్పరం అంగీకారం తెలిపిన దేశాల్లో కెనడా, అమెరికా, యూకే(బ్రిటన్), ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్, నెదర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, స్వీడన్, బ్రెజిల్, రష్యా, కువైట్, ఒమన్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్ తోపాటు మొత్తం 96 దేశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాండవీయ తెలిపారు.
అంతేగాక, ఈ దేశాలతోపాటు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పరస్పర గుర్తింపు కోసం మిగితా దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటి వరకు 109 కోట్ల మందికిపైగా టీకా డోసులు తీసుకున్నారని తెలిపారు.
Recommended Video
కాగా, భారత ఫార్మా దిగ్గజాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందన్న మాండవీయ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 8 వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేసిందన్నారు. ఇందులో రెండు(కోవిషీల్డ్, కోవాగ్జిన్) టీకాలు భారత్‌కు చెందినవి ఉండటం గర్వకారణమన్నారు. కాగా, దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications