ప్రపంచ సంతోషకర దేశాల్లో చైనా, పాకిస్తాన్ కన్నా వెనుకబడిన భారత్; అగ్రస్థానంలో ఫిన్లాండ్!!
ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు.. సంతోషానికి మించిన సంపద లేదు అంటారు. అయితే అటువంటి సంతోషం విషయంలో మన దేశం ఏ స్థానంలో ఉంది? ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏది? వంటి అనేక వివరాలను నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్ మరోమారు టాప్ పొజిషన్లో నిలిచింది. ఫిన్లాండ్ గత ఏడు దఫాలుగా సంతోషకరమైన దేశాలలో అగ్రస్థానంలో నిలవడం చెప్పుకోదగిన అంశం. అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా యూ ఎన్ ఆధారిత సంస్థ విడుదల చేసిన తాజా ర్యాంకుల ప్రకారం ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాలో భారతదేశం చైనా, పాకిస్తాన్ వంటి దేశాల కంటే వెనుకబడిందని చెప్పడం నిజంగా ఆందోళన కలిగించే అంశం.

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల ర్యాంకులను ప్రకటించిన యూ ఎన్ ఆధారిత సంస్థ 143 కు పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకొని దీనిని రూపొందించింది. సంతోష సూచీ లలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐస్లాండ్ నిలిచాయి. భారతదేశం అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో 126వ స్థానంలో నిలిచింది.
భారతదేశం కంటే సంతోషకరమైన దేశంగా చైనా 60వ స్థానంలో, పాకిస్తాన్ 108వ స్థానంలో నిలిచాయి. అన్ని రంగాలలోనూ ప్రగతి సాధిస్తున్న భారతదేశం సంతోషకరమైన దేశంగా మాత్రం చాలా వెనకబడి పోయింది అన్నది ర్యాంకులను బట్టి అర్థమవుతుంది. ఇక ఈ జాబితాలో తాలిబన్ పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది.
ప్రకృతితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడం, ఆరోగ్యకరమైన పనిని జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఫిన్లాండ్ ప్రజల సంతోషానికి కారణాలని, జీవితంలో విజయంతోనే సంతోషం ముడిపడి ఉంటుంది అన్న విషయాన్ని అక్కడ ప్రజలు అంగీకరించరని అధ్యయనం ద్వారా తెలిసింది. ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ అవినీతి, విద్య, వైద్యం, ప్రజల ఆరోగ్యసంరక్షణ వంటి అనేక అంశాలు కూడా ఇక్కడి ప్రజల సంతోషకరమైన జీవితానికి కారణాలని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ పేర్కొంది.












Click it and Unblock the Notifications