• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరుగుతున్న ఐటీ కల.. మధ్య తరగతి ‘డాలర్’ డ్రీమ్ కనుమరుగేనా?

By Swetha Basvababu
|

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలతో భారత ఐటీ రంగం.. రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో టెలికం రంగాలు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. అటు ఐటీ, ఇటు టెలికం కంపెనీలన్నీ భారీగా ఉద్యోగాల్లో కోత విధించేందుకు పూనుకున్నాయి. భారీ స్థాయిలో తమ ఉద్యోగులను ఇంటి బాట పట్టిస్తున్నాయి.

2008-10 మధ్య కాలంలో నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ కంపెనీల్లో చవిచూస్తున్నాయి. భారత ఐటీ కంపెనీల్లో 39 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని అంచనా. నిన్న మొన్నటి దాకా ఆకాశంలో విహరించిన ఐటీ రంగం.. లక్షలాది మంది ఐటీ గ్రాడ్యుయేట్లకి ఆశాదీపం.

తాజాగా మారిన పరిస్థితుల్లో కానీ కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, క్యాప్జెమిని వంటి ఐటీ దిగ్గజాలు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం ఆరంభించడంతో కొత్త గ్రాడ్యుయేట్లకే కాదు.. పాత ఉద్యోగుల గుండెల్లో సైతం రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక వైపు పశ్చిమ దేశాల్లో ఆర్థిక మందగమనం.. ఇంకోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో 'హైర్ లోకల్' విధానాలు.. మరోవైపు వేగంగా పెరుగుతున్న ఆటోమేషన్.. భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్‌పై ముప్పేట దాడి చేస్తున్నాయి. వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

వేటుకు ఐటీ వృద్ధి మందగమనమూ కారణమే

వేటుకు ఐటీ వృద్ధి మందగమనమూ కారణమే

ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సేవల బ్యాక్ ఆఫీస్‌గా పనిచేస్తున్న భారత ఐటీ పరిశ్రమకు ఇప్పుడు కష్టాలు ఆరంభమైనట్లు కనిపిస్తోంది. 100 బిలియన్ డాలర్ల భారత సాఫ్ట్‌వేర్ ఎగుమతుల వాణిజ్యం.. 60 శాతానికి పైగా ఆదాయాన్ని ఉత్తర అమెరికా ఖండం మార్కెట్ నుంచే ఆర్జిస్తోంది. మరో 20 శాతం ఆదాయాన్ని యూరప్ నుంచి, మిగతా మొత్తం ఇతర దేశాల నుంచి పొందుతోంది. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా భారతీయ ఐటీ పరిశ్రమ 20 శాతానికి పైగా లాభాలతో దూసుకెళుతోంది. ఇది దేశంలో ఐటీ విద్యకు విపరీతమైన డిమాండ్ పెంచింది. మధ్య తరగతి వర్గం డాలర్ డ్రీమ్స్ సాకారం కావడానికి అవకాశాలను అందించింది. దీంతో ఇతరత్రా రంగాలకన్నా ఐటీ రంగానికి విద్యలో డిమాండ్ పెరిగింది.

తగ్గతున్న భారత ఐటీ దిగ్గజాల వృద్ధి

తగ్గతున్న భారత ఐటీ దిగ్గజాల వృద్ధి

ఐటీ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు సాధించడమూ పెద్ద కష్టం కాలేదు. అయితే.. పశ్చిమ దేశాల్లో ఆర్థికాభివృద్ధి మందగమనంతో అమెరికా సహా చాలా దేశాల్లో ఐటీ కాంట్రాక్టుల వ్యయానికి కోత పెడుతున్నాయి. దీనికి తోడు రూపాయి బలపడుతోంది. ఫలితంగా భారత ఐటీ పరిశ్రమల వృద్ధి తగ్గుముఖం పడుతోంది. లాభాలు పడిపోతున్నాయి. కొన్ని సంస్థల్లో వృద్ధి రేటు మైనస్‌లోకి కూడా వెళుతోంది. భారత ఐటీ పరిశ్రమ వృద్ధి ఊహించిన దాని కన్నా తగ్గిన నేపథ్యంలో ఉద్యోగుల ఉద్వాసనలు ఊపందుకున్నాయి. ‘రూపాయి బలపడడం వల్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా భారత ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితిలోకి వెళతాయి' అని అసోచామ్ గత నెలలోనే హెచ్చరించింది.

ఉద్యోగుల తొలగింపుపై కాగ్నిజెంట్ ఇలా

ఉద్యోగుల తొలగింపుపై కాగ్నిజెంట్ ఇలా

ఓ వైపు ట్రంప్ ఎఫెక్ట్, మరోవైపు ఆటోమేషన్ ప్రభావం మల్టినేషనల్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ దాదాపు 6000 మందికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో 2.3శాతం మందిని కంపెనీ తీసేస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటున్న సంక్షోభంతో కాగ్నిజెంట్ తన ఉద్యోగులను తగ్గించుకుంటున్నది. ఇటీవల సీనియర్ ఉద్యోగులను సాదరంగా ఇంటికి సాగనంపే క్రమంలో 9నెలల జీతాలిస్తుందని కూడా రిపోర్టులు వస్తున్నాయి. డి ప్లస్ కేటగిరి ఉద్యోగులు సుహృద్భావం వాతావరణంలో సంస్థను విడిచిపెట్టాలని కోరుతూ ఈ-మెయిల్స్ కూడా పంపిందని సమాచారం.

9000 వేల మందికి ఇంటికి పంపనున్న కాప్జెమిని

9000 వేల మందికి ఇంటికి పంపనున్న కాప్జెమిని

ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాప్జెమిని కూడా సుమారు 9000 మందిని ఇంటికి పంపించనున్నట్టు తెలిపింది. గత ఫిబ్రవరిలోనే 35 మంది వీపీ, ఎస్వీపీ, డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లను కంపెనీ వీడాలని కాప్జెమిని ఆదేశించింది. తన ఆఫీసుల్లో ఒకటైన ముంబైలో 200 మందికి ఉద్వాసన పలకాలని కూడా నిర్ణయించింది. లేఆఫ్స్ గురించి స్పందించిన కంపెనీ, ఉద్యోగులను తీసే క్రమంలోనే కొత్త ఉద్యోగులను కంపెనీలోకి తీసుకుంటున్నామని తెలిపింది.

పనితీరు సాకుతో విప్రోలో 2000 మంది ఇంటికే

పనితీరు సాకుతో విప్రోలో 2000 మంది ఇంటికే

విప్రో సంస్ధ ఐటీ సేవల ఆదాయంలో 2017లో వరుసగా రెండు త్రైమాసికాల పాటు ప్రతికూల వృద్ధి రేటు నమోదైంది. కొత్త ఉద్యోగుల నియామకం కూడా గతంతో పోలిస్తే తగ్గింది. ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధి రేటు 2016 ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతంగా ఉంటే.. 2017 ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతానికి తగ్గింది. ఈ సంస్థ నిర్వహణ లాభాలు కూడా 2014-15 నుండి తగ్గుతూ వస్తున్నాయి. ఆ ఏడాది 25.9 శాతంగా ఉన్న నిర్వహణ లాభాలు ప్రస్తుతం 24.7 శాతానికి తగ్గాయి.భారతదేశంలో మూడో అతిపెద్ద టెక్ దిగ్గజం విప్రో కంపెనీ. పనితీరు బాగోలేదనే పేరుతో ఇప్పటికే ఈ కంపెనీ 600 నుంచి రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసినట్టు తెలిసింది. అంతేకాక కంపెనీలో అదనపు లేయర్లను తీసేయనుందట.

గత రెండేళ్లలో ఇన్పోసిస్ ఇలా

గత రెండేళ్లలో ఇన్పోసిస్ ఇలా

గత రెండేళ్లలో 17,857 మంది, 15,782 మంది చొప్పున కొత్త ఉద్యోగులను చేర్చుకున్న ఇన్ఫోసిస్ 2017 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6,320 మందిని మాత్రమే కొత్తగా చేర్చుకుంది. వచ్చే కొన్ని రోజుల్లో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల కోత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధిత వర్గాల ప్రకారం ఈ కంపెనీ 1000 మందిని తీసేస్తుందని తెలుస్తోంది. దీనిలో గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్ ఆర్కిటెక్ట్స్, హైయర్ లెవల్స్ వారు ఉండొచ్చని సంబంధిత వర్గాల సమాచారం. ఈ కంపెనీ ఇటీవలే భారతీయ టెక్కీలకు షాకిస్తూ అమెరికన్లకు 10000 ఉద్యోగాలను ప్రకటించింది.

టీసీఎస్‌లో స్వల్పంగా తగ్గిన కొత్త నియామకాలు

టీసీఎస్‌లో స్వల్పంగా తగ్గిన కొత్త నియామకాలు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్‌) సంస్థలో కూడా కొత్త ఉద్యోగుల నియామకం స్వల్పంగా తగ్గింది. 2016లో 34,187 మందిని చేర్చుకున్న ఆ సంస్థ 2017లో 33,380 మందిని నియమించుకుంది. ఇక ఈ సంస్థ నిర్వహణ లాభాలు కూడా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 26.5 శాతం నుండి 25.7 శాతానికి తగ్గాయి. ఆదాయం కూడా 7.1 శాతం నుండి 6.2 శాతానికి తగ్గింది.

దూసుకొస్తున్న ఆటోమేషన్‌ భూతం

దూసుకొస్తున్న ఆటోమేషన్‌ భూతం

ఇక డిజిటల్ సాంకేతికతల్లో ఆటోమేషన్ విప్లవం కూడా ఐటీ రంగం రూపురేఖలను మార్చేస్తోంది. బిజినెస్ ఎనలైటిక్స్, క్లౌడ్, మొబిలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) వంటి అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల విస్తరణతో ఐటీ పరిశ్రమ మరో భారీ పరిణామం మలుపులో ఉంది. ఐటీ సర్వీసెస్ సంస్ధలు ఈ కొత్త సాంకేతికతలకు, కొత్త రకాల డిమాండ్లకు అనుగుణంగా మారక తప్పని పరిస్థితి. ఒకప్పుడు మానవ శ్రమకు పోటీగా వచ్చిన యాంత్రీకరణ పరిశ్రమల్లో కార్మికుల ఉద్యోగాలకు ఎసరు పెట్టినట్లే.. ఇప్పుడు ఐటీ రంగంలో ఆటోమేషన్ ఆ రంగ ఉద్యోగులను నిరుద్యోగులుగా మారుస్తోంది. ఐటీ సర్వీసెస్ సంస్థల్లోని ఉద్యోగుల్లో దాదాపు సగం మంది మరో మూడు, నాలుగేళ్లలో నిరుపయోగంగా మారతారని అంతర్జాతీయ సలహా సంస్థ మెక్కిన్సీ ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది.

టెక్నాలజీలో మార్పుతో 50 - 60 శాతం సిబ్బంది కొనసాగింపు సవాలే

టెక్నాలజీలో మార్పుతో 50 - 60 శాతం సిబ్బంది కొనసాగింపు సవాలే

సాంకేతికతల్లో గణనీయమైన మార్పు వల్ల.. 50 నుంచి 60 శాతం మంది ఉద్యోగులను కొనసాగించడం ఐటీ పరిశ్రమలకు పెద్ద సవాలు అవుతుందని మెకెన్సీ జోస్యం చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో మనుషుల స్థానంలో మెషీన్ల నియామకం ప్రముఖంగా కనిపిస్తోంది. ఆటోమేషన్ ప్రభావం ప్రధానంగా మానవ ప్రమేయం తక్కువగా అవసరమయ్యే కింది స్థాయి ఉద్యోగాల మీద ఉంటుంది. కొత్త సాంకేతికతలకు అనుగుణంగా ఉద్యోగులకు మళ్లీ నైపుణ్య శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఉంది. విప్రో వంటి చాలా పెద్ద సంస్థలు ఆ పని ఇప్పటికే చేస్తున్నాయి కూడా. పాత సిబ్బందినే తగ్గించుకుని, ఉన్నవారికి శిక్షణనిస్తూ, కొత్త ఉద్యోగుల నియామకాలను పరిమితం చేస్తున్నాయి.

విదేశాల్లో ‘హైర్ లోకల్’ దెబ్బ..

విదేశాల్లో ‘హైర్ లోకల్’ దెబ్బ..

భారత ఐటీ పరిశ్రమ విజయగాధలో భారతీయ ఐటీ ఉద్యోగుల పాత్ర చాలా ప్రధానమైనది. మామూలు మాటల్లో చెప్తే.. భారతదేశంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నియమించుకోవడానికి అయ్యే వ్యయం.. అమెరికాలో అదే ఇంజనీర్‌ను నియమించుకోవడానికి అయ్యే వ్యయంతో పోలిస్తే చాలా తక్కువ. దీంతో.. ఇక్కడ ఉద్యోగులకు రూపాయిల్లో జీతం ఇస్తూ.. అమెరికా, యూరప్‌లలోని క్లయింట్ల నుంచి డాలర్లు, యూరోలు, పౌండ్లలో బిల్లులు వసూలు చేయడం వల్ల సాఫ్ట్‌వేర్ పరిశ్రమ చాలా లాభదాయక వ్యాపారంగా వృద్ధిలో పరుగులూ పెడుతూ వచ్చింది. భారత ఐటీ నిపుణులను ఉద్యోగ వీసాలపై విదేశాల్లోని తమ సంస్థల్లో నియమించుకోవడం అవిచ్ఛిన్నంగా సాగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.

అమెరికా, బ్రిటన్‌లలో స్వీయరక్షణకు పెద్దపీట

అమెరికా, బ్రిటన్‌లలో స్వీయరక్షణకు పెద్దపీట

ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అమెరికా సహా బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర సంస్థలు స్వీయ రక్షణ చర్యలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈయూ నుంచి బ్రెగ్జిట్, ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం ఈ కోవకు చెందినవే. విదేశీ సంస్థలైనా తమ దేశంలోని ఉద్యోగులకు తగిన అవకాశాలు కల్పించాలన్న డిమాండ్లు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. బ్రిటన్ టైర్-2 వీసాదారులకు కనీస వేతన పరిమితిని 35,000 పౌండ్లకు పెంచడం, అమెరికా హెచ్-1బి వీసాలపై ఆంక్షలను కఠినం చేసే ప్రయత్నాలు, ఆస్ట్రేలియా, సింగపూర్లు కూడా ఉద్యోగ వీసాలపై ఆంక్షలు విధిస్తున్న పరిణామాలు ఈ కోవలోనివే. ఇన్ఫోసిస్ సంస్థ అమెరికాలో 10,000 మంది స్థానికులను ఉద్యోగాల్లో నియమించుకోనున్నట్లు ప్రకటించింది. అంటే.. ఆ దేశంలో వ్యాపార నిర్వహణ వాతావరణం మారిందని ఆ సంస్థ గుర్తించినట్లు పరిశీలకులు చెప్తున్నారు. ఇతర భారతీయ సంస్థలు కూడా బహిరంగంగా ప్రకటించినా లేకున్నా ఇదే మార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి నెలకొన్నది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
America and other western countries followed self protection policies in IT & other sector employeement. This would be effected on Indian IT Sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more